Loading date... | Loading Hijri date... | Loading time...

الأنبياء

తెలుగు Translation with Arabic Quran Text

తెలుగు العربية
1 మానవులతో లెక్క (తీసుకునే) సమయం సమీపించింది, అయినా వారు ఏమరుపాటులో పడి విముఖులై ఉన్నారు.[1]
[1] అంటే పునరుత్థాన దినం.
ٱقْتَرَبَ لِلنَّاسِ حِسَابُهُمْ وَهُمْ فِى غَفْلَةٍۢ مُّعْرِضُونَ. ﴿1﴾
2 (కావున) వారి ప్రభువు తరఫు నుండి వారి వద్దకు ఏ క్రొత్త సందేశం వచ్చినా, వారు దానిని పరిహసించకుండా వినలేరు. مَا يَأْتِيهِم مِّن ذِكْرٍۢ مِّن رَّبِّهِم مُّحْدَثٍ إِلَّا ٱسْتَمَعُوهُ وَهُمْ يَلْعَبُونَ. ﴿2﴾
3 వారి హృదయాలు వినోద క్రీడలలో (అశ్రద్ధలో) మునిగి ఉన్నాయి. మరియు వారిలో దుర్మార్గానికి పాల్పడిన వారు రహస్య సంప్రదింపులు చేసుకొని (ఇలా అంటారు): "ఏమీ? ఇతను (ముహమ్మద్) మీలాంటి ఒక సాధారణ మానవుడు కాడా?[1] అయినా మీరు చూస్తూ వుండి కూడా, ఇతని మంత్రజాలంలో[2] చిక్కుకుపోయారా?"
[1] అంటే ఆ కాలపు మక్కా ముష్రికులు, వారి తోటి మానవుడు ప్రవక్త కావడం నమ్మ లేక పోయారు. కాని ఈ కాలంలో కొందరు ప్రవక్తలను దైవాలుగా చేసుకుంటున్నారు. [2] అస్-సి'హ్రా: మంత్రజాలం, జాలవిద్య, మాయాజాలం. ఈ పదం ఖుర్ఆన్ అవతరణ క్రమంలో మొదటి సారి 74:24లో వచ్చింది.
لَاهِيَةًۭ قُلُوبُهُمْ ۗ وَأَسَرُّوا۟ ٱلنَّجْوَى ٱلَّذِينَ ظَلَمُوا۟ هَلْ هَٰذَآ إِلَّا بَشَرٌۭ مِّثْلُكُمْ ۖ أَفَتَأْتُونَ ٱلسِّحْرَ وَأَنتُمْ تُبْصِرُونَ. ﴿3﴾
4 (ముహమ్మద్) ఇలా అన్నాడు: "నా ప్రభువుకు ఆకాశంలోను మరియు భూమిలోను పలుకబడే ప్రతి మాట తెలుసు. మరియు ఆయన సర్వం వినేవాడు, సర్వజ్ఞుడు. قَالَ رَبِّى يَعْلَمُ ٱلْقَوْلَ فِى ٱلسَّمَآءِ وَٱلْأَرْضِ ۖ وَهُوَ ٱلسَّمِيعُ ٱلْعَلِيمُ. ﴿4﴾
5 అలా కాదు! వారన్నారు: "ఇవి (ఈ సందేశాలు) కేవలం పీడకలలు మాత్రమే; కాదు కాదు! ఇతడే దీనిని కల్పించాడు; అలా కాదు! ఇతడొక కవి! (ఇతడు ప్రవక్తయే అయితే) పూర్వం పంపబడిన సందేశహరుల మాదిరిగా, ఇతనిని కూడా మా కొరకు ఒక అద్భుత సూచన (ఆయత్) ను తెమ్మను!" بَلْ قَالُوٓا۟ أَضْغَٰثُ أَحْلَٰمٍۭ بَلِ ٱفْتَرَىٰهُ بَلْ هُوَ شَاعِرٌۭ فَلْيَأْتِنَا بِـَٔايَةٍۢ كَمَآ أُرْسِلَ ٱلْأَوَّلُونَ. ﴿5﴾
6 మరియు వీరికి పూర్వం మేము నాశనం చేసిన ఏ పురవాసులు కూడా విశ్వసించి ఉండలేదు. అయితే! వీరు మాత్రం విశ్వసిస్తారా? مَآ ءَامَنَتْ قَبْلَهُم مِّن قَرْيَةٍ أَهْلَكْنَٰهَآ ۖ أَفَهُمْ يُؤْمِنُونَ. ﴿6﴾
7 మరియు నీకు పూర్వం కూడా (ఓ ముహమ్మద్!) మేము పురుషులను మాత్రమే ప్రవక్తలుగా చేసి పంపి, వారిపై దివ్యజ్ఞానాన్ని (వహీని) అవతరింపజేశాము. కావున మీకిది తెలియకుంటే హితబోధ గలవారిని (గ్రంథప్రజలను) అడగండి. وَمَآ أَرْسَلْنَا قَبْلَكَ إِلَّا رِجَالًۭا نُّوحِىٓ إِلَيْهِمْ ۖ فَسْـَٔلُوٓا۟ أَهْلَ ٱلذِّكْرِ إِن كُنتُمْ لَا تَعْلَمُونَ. ﴿7﴾
8 మరియు మేము వారికి (ఆ ప్రవక్తలకు) ఆహారం తినే అవసరం లేని శరీరాలను ఇవ్వలేదు. మరియు వారు చిరంజీవులు కూడా కాలేదు.[1]
[1] అంటే ఏ ప్రవక్తకు కూడా అమానుషమైన యోగ్యతలు ప్రసాదించబడలేదు. వారు ('అలైహిమ్. స.) సాధారణ మానవుల్లాగానే ఉండేవారు, కాని వారిపై అల్లాహ్ (సు.తా.) దివ్యజ్ఞానం (వ'హీ) అవతరింపజేయబడుతూ ఉండేది. వారికి అల్లాహ్ (సు.తా.) తెలిపినది తప్ప మరే అగోచర జ్ఞానం లేదు. ఇంకా చూడండి, 5:75, 3:164, 13:38, 25:20.
وَمَا جَعَلْنَٰهُمْ جَسَدًۭا لَّا يَأْكُلُونَ ٱلطَّعَامَ وَمَا كَانُوا۟ خَٰلِدِينَ. ﴿8﴾
9 ఆ పిదప మేము వారికి చేసిన వాగ్దానాలు పూర్తి చేశాము. కావున వారిని మరియు మేము కోరిన వారిని రక్షించాము మరియు మితిమీరి ప్రవర్తించిన వారిని నాశనం చేశాము. ثُمَّ صَدَقْنَٰهُمُ ٱلْوَعْدَ فَأَنجَيْنَٰهُمْ وَمَن نَّشَآءُ وَأَهْلَكْنَا ٱلْمُسْرِفِينَ. ﴿9﴾
10 (ఓ మానవులారా!) వాస్తవంగా, మేము మీ కొరకు ఒక గ్రంథాన్ని (ఖుర్ఆన్ ను) అవతరింపజేశాము. అందులో మీ కొరకు ఉపదేశముంది. ఏమీ? మీరిది అర్థం చేసుకోలేరా? لَقَدْ أَنزَلْنَآ إِلَيْكُمْ كِتَٰبًۭا فِيهِ ذِكْرُكُمْ ۖ أَفَلَا تَعْقِلُونَ. ﴿10﴾
11 మరియు దుర్మార్గానికి పాల్పడిన ఎన్ని నగరాలను మేము నిర్మూలించలేదు! మరియు వారి తరువాత మరొక జాతి వారిని పుట్టించాము![1]
[1] చూడండి, 17:17
وَكَمْ قَصَمْنَا مِن قَرْيَةٍۢ كَانَتْ ظَالِمَةًۭ وَأَنشَأْنَا بَعْدَهَا قَوْمًا ءَاخَرِينَ. ﴿11﴾
12 మా శిక్ష (రావటం) తెలుసుకున్నప్పుడు వారు దాని నుండి పారిపోవటానికి ప్రయత్నంచేవారు. فَلَمَّآ أَحَسُّوا۟ بَأْسَنَآ إِذَا هُم مِّنْهَا يَرْكُضُونَ. ﴿12﴾
13 (అప్పుడు వారితో ఇలా చెప్పబడింది): "పారిపోకండి! మరలిరండి - మీరు అనుభవిస్తున్న, మీ సుఖసంపదల వైపుకు మరియు మీ ఇళ్ళ వైపుకు - ఎందుకంటే! మిమ్మల్ని ప్రశ్నించవలసి ఉంది!" لَا تَرْكُضُوا۟ وَٱرْجِعُوٓا۟ إِلَىٰ مَآ أُتْرِفْتُمْ فِيهِ وَمَسَٰكِنِكُمْ لَعَلَّكُمْ تُسْـَٔلُونَ. ﴿13﴾
14 వారన్నారు: "అయ్యో! మా దౌర్భాగ్యం! నిస్సందేహంగా మేము దుర్మార్గులము." قَالُوا۟ يَٰوَيْلَنَآ إِنَّا كُنَّا ظَٰلِمِينَ. ﴿14﴾
15 ఆ పిదప మేము వారిని కోయబడిన పైరువలే, చల్లారిన అగ్ని వలే, చేసినంత వరకు వారి అరపు ఆగలేదు. فَمَا زَالَت تِّلْكَ دَعْوَىٰهُمْ حَتَّىٰ جَعَلْنَٰهُمْ حَصِيدًا خَٰمِدِينَ. ﴿15﴾
16 మరియు మేము ఈ ఆకాశాన్ని, భూమిని మరియు వాటి మధ్య ఉన్నదంతా కేవలం వినోదం కొరకు సృష్టించలేదు. وَمَا خَلَقْنَا ٱلسَّمَآءَ وَٱلْأَرْضَ وَمَا بَيْنَهُمَا لَٰعِبِينَ. ﴿16﴾
17 ఒకవేళ మేము కాలక్షేపమే చేయదలచుకుంటే, మేము మా వద్ద ఉన్న దానితోనే చేసుకునే వారం; వాస్తవానికి, ఇలా చేయడమే, మా ఉద్దేశ్యమై ఉంటే![1]
[1] చూడండి, 10:5.
لَوْ أَرَدْنَآ أَن نَّتَّخِذَ لَهْوًۭا لَّٱتَّخَذْنَٰهُ مِن لَّدُنَّآ إِن كُنَّا فَٰعِلِينَ. ﴿17﴾
18 అలా కాదు! మేము సత్యాన్ని అసత్యంపై విసురుతాము. అది దాని తలను పగుల గొడుతుంది, అప్పుడు అది (అసత్యం) నశించి పోతుంది మరియు మీరు కల్పించే కల్పనలకు, మీకు వినాశం తప్పదు. بَلْ نَقْذِفُ بِٱلْحَقِّ عَلَى ٱلْبَٰطِلِ فَيَدْمَغُهُۥ فَإِذَا هُوَ زَاهِقٌۭ ۚ وَلَكُمُ ٱلْوَيْلُ مِمَّا تَصِفُونَ. ﴿18﴾
19 మరియు ఆకాశాలలో మరియు భూమిలో ఉన్న సమస్తమూ ఆయనకు చెందినదే. మరియు ఆయనకు దగ్గరగా ఉన్నవారు, ఆయనను ఆరాధిస్తూ ఉన్నామని గర్వించరు మరియు (ఆయన ఆరాధనలో) అలసట కూడా చూపరు. [1]
[1] చాలా మంది వ్యాఖ్యాతలు వీరిని దైవదూతలుగా పరిగణిస్తారు.
وَلَهُۥ مَن فِى ٱلسَّمَٰوَٰتِ وَٱلْأَرْضِ ۚ وَمَنْ عِندَهُۥ لَا يَسْتَكْبِرُونَ عَنْ عِبَادَتِهِۦ وَلَا يَسْتَحْسِرُونَ. ﴿19﴾
20 వారు రేయింబవళ్ళు ఆయన పవిత్రతను కొనియాడుతూ ఉంటారు, వారు ఎన్నడూ బలహీనత చూపరు. يُسَبِّحُونَ ٱلَّيْلَ وَٱلنَّهَارَ لَا يَفْتُرُونَ. ﴿20﴾
21 ఏమీ? వారు భూలోకం నుండి ఆరాధ్య దైవాలను నియమించుకున్నారా? అవి (చనిపోయిన వారిని) మరల బ్రతికించి లేపగలవా?[1]
[1] అంటే అవి చనిపోయిన వారిని మరల బ్రతికించి లేపలేవు, అని అర్థం. అంటే వారికి ఎలాంటి శక్తి లేదు. అలాంటప్పుడు వారు ఆ కల్పిత దైవాలను ఎందుకు ఆరాధించాలి?
أَمِ ٱتَّخَذُوٓا۟ ءَالِهَةًۭ مِّنَ ٱلْأَرْضِ هُمْ يُنشِرُونَ. ﴿21﴾
22 వాటిలో (భూమ్యాకాశాలలో) అల్లాహ్ తప్ప ఇతర ఆరాధ్య దైవాలు ఉంటే అవి రెండూ నాశనమైపోయేవే కదా! కావున సింహాసనానికి (అర్ష్ కు) ప్రభువైన అల్లాహ్! వారు కల్పించే కల్పనలకు అతీతుడు.[1]
[1] ఒకవేళ అల్లాహ్ (సు.తా.)కు సాటిగా మరొక దైవం ఉండి ఉంటే, ఇద్దరి ఆధిపత్యం నడిచేది. ప్రతి ఒక్కరూ తమ ఇచ్ఛానుసారంగా ప్రపంచాన్ని నడపగోరేవారు. దాని వల్ల విశ్వంలో ఇంత శాంతి ఉండక పోయేది. అల్లకల్లోలం చెలరేగిపోయేది. మానవుల రాజ్యపాలన ఏదైతే భూమిలోని ఒక్క చిన్న భాగం మీద ఉందో, దానికి ఒకే ఒక్క ఉన్నత పాలకుడిని ప్రసిడెంట్, లేక రాజు, లేక ప్రైమ్ మినిష్టర్ ను నియమించుకుంటాము. అలాంటప్పుడు విశ్వసామ్రాజ్య వ్యవస్థలో ఒకని కంటే ఎక్కువ పాలకులు ఉండి ఉంటే, అల్లాకల్లోలం చెలరేగదా? ఇంకా చూడండి, 6:100.
لَوْ كَانَ فِيهِمَآ ءَالِهَةٌ إِلَّا ٱللَّهُ لَفَسَدَتَا ۚ فَسُبْحَٰنَ ٱللَّهِ رَبِّ ٱلْعَرْشِ عَمَّا يَصِفُونَ. ﴿22﴾
23 తాను చేసే దానిని గురించి ఆయన (అల్లాహ్) ప్రశ్నించబడడు, కాని వారు ప్రశ్నించబడతారు. لَا يُسْـَٔلُ عَمَّا يَفْعَلُ وَهُمْ يُسْـَٔلُونَ. ﴿23﴾
24 ఏమీ? వారు ఆయనను వదలి ఇతర ఆరాధ్య దైవాలను నియమించుకున్నారా? వారితో అను: "మీ నిదర్శనాన్ని తీసుకురండి." ఇది (ఈ ఖుర్ఆన్) నాతో పాటు ఉన్నవారికి హితబోధ; మరియు నా పూర్వీకులకు కూడా (ఇలాంటి) హితబోధలు (వచ్చాయి). కాని వారిలో చాలా మంది సత్యాన్ని గ్రహించలేదు, కావున వారు విముఖులై పోతున్నారు. أَمِ ٱتَّخَذُوا۟ مِن دُونِهِۦٓ ءَالِهَةًۭ ۖ قُلْ هَاتُوا۟ بُرْهَٰنَكُمْ ۖ هَٰذَا ذِكْرُ مَن مَّعِىَ وَذِكْرُ مَن قَبْلِى ۗ بَلْ أَكْثَرُهُمْ لَا يَعْلَمُونَ ٱلْحَقَّ ۖ فَهُم مُّعْرِضُونَ. ﴿24﴾
25 మరియు మేము, నీకు పూర్వం ఏ ప్రవక్తను పంపినా: "నిశ్చయంగా, నేను (అల్లాహ్) తప్ప మరొక ఆరాధ్యుడు లేడు! కావున మీరు నన్నే (అల్లాహ్ నే) ఆరాధించండి." అని దివ్యజ్ఞానం (వహీ) ఇచ్చిపంపాము. وَمَآ أَرْسَلْنَا مِن قَبْلِكَ مِن رَّسُولٍ إِلَّا نُوحِىٓ إِلَيْهِ أَنَّهُۥ لَآ إِلَٰهَ إِلَّآ أَنَا۠ فَٱعْبُدُونِ. ﴿25﴾
26 వారంటున్నారు: "అనంత కరుణామయునికి సంతానముంది!" అని. ఆయన సర్వలోపాలకు అతీతుడు, (అల్లాహ్ సంతానంగా పరిగణించబడే) వారు కేవలం గౌరవనీయులైన (ఆయన) దాసులు మాత్రమే!"[1]
[1] చూడండి, 19:92.
وَقَالُوا۟ ٱتَّخَذَ ٱلرَّحْمَٰنُ وَلَدًۭا ۗ سُبْحَٰنَهُۥ ۚ بَلْ عِبَادٌۭ مُّكْرَمُونَ. ﴿26﴾
27 వారు ఆయన (అనుమతించక) ముందు మాట్లాడలేరు. మరియు వారు (దైవదూతలు) ఆయన ఆజ్ఞలనే పాటిస్తూ ఉంటారు.[1]
[1] ఈ ఆయత్ ముష్రికీన్ లు దేవదూతలను ('అ.స.) అల్లాహ్ (సు.తా.) బిడ్డలుగా పరిగణించే విషయాన్ని ఖండిస్తుంది. దేవదూతలు ('అ.స.) అల్లాహ్ (సు.తా.) సృష్టించిన దాసులు మరియు ఆయన ఆజ్ఞలను పాటిస్తూ ఉంటారు.
لَا يَسْبِقُونَهُۥ بِٱلْقَوْلِ وَهُم بِأَمْرِهِۦ يَعْمَلُونَ. ﴿27﴾
28 ఆయనకు, వారికి ప్రత్యక్షంగా (ముందు) ఉన్నదీ, అంతా తెలుసు. వారు, ఆయన సమ్మతించిన వారికి తప్ప ఇతరుల కొరకు సిఫారసు చేయలేరు.[1] వారు, ఆయన భీతి వలన భయకంపితులై ఉంటారు.
[1] చూడండి, 2:255 దీనితో వ్యక్తమయ్యేది ఏమిటంటే ప్రవక్తలు మరియు 'సాలెహీన్ లే గాక దైవదూతలు కూడా, అల్లాహ్ (సు.తా.) అనుమతించిన వారికి మాత్రమే సిఫారసు చేయగలరు. ఇంకా చూడండి, 10:3, 19:87, 20:109, 53:26.
يَعْلَمُ مَا بَيْنَ أَيْدِيهِمْ وَمَا خَلْفَهُمْ وَلَا يَشْفَعُونَ إِلَّا لِمَنِ ٱرْتَضَىٰ وَهُم مِّنْ خَشْيَتِهِۦ مُشْفِقُونَ. ﴿28﴾
29 వారిలో (దేవదూతలలో) ఎవరైనా: "నిశ్చయంగా, ఆయనే కాక, నేను కూడా ఒక ఆరాధ్య దైవాన్ని" అని అంటే, అలాంటి వానికి మేము నరకశిక్ష విధిస్తాము.[1] మేము దుర్మార్గులను ఇదే విధంగా శిక్షిస్తాము.
[1] ఇది ఒక ఉదారహణమే. ఇలా సంభవించనవసరం లేదు. అంటే దేవదూతలు ఎన్నడూ అలా చేయరు. ఒకవేళ వారు అలా చేస్తే, వారు ('అలైహిమ్. స.) కూడా శిక్షించబడతారు. ఈ విధమైన ఉదాహరణలకు చూడండి, 43:81 మరియు 39:65.15.
۞ وَمَن يَقُلْ مِنْهُمْ إِنِّىٓ إِلَٰهٌۭ مِّن دُونِهِۦ فَذَٰلِكَ نَجْزِيهِ جَهَنَّمَ ۚ كَذَٰلِكَ نَجْزِى ٱلظَّٰلِمِينَ. ﴿29﴾
30 ఏమి? ఈ సత్యతిరస్కారులకు తెలియదా (చూడలేదా)? వాస్తవానికి భూమ్యాకాశాలు (ఒకే ఒక్క భౌతికాంశంగా) కలుసుకొని ఉండేవని, అయితే మేమే వాటిని పగుల గొట్టి వేరు చేశామని?[1] మరియు మేమే ప్రతి ప్రాణిని నీటి నుండి పుట్టించాము.[2] ఇకనైన వారు విశ్వసించరా?
[1] ఇదే సైంటిస్టులు పలికే Big Bang Theory. ఈ ఆయత్ అవతరింపజేయబడినప్పుడు అరేబియా వాసులకు ఏ విధమైన సైన్సు జ్ఞానం లేదు. ఈ Big Band Theory ఇప్పుడిప్పుడే ఆవిష్కరించబడింది. ఈ ఖుర్ఆన్ ను దైవప్రవక్త ('స'అస) వ్రాయలేదు, ఎందుకంటే అతను నిరక్షరాస్యుడని మక్కా ప్రజలందరికీ తెలుసు. ఆ కాలపు విద్వాంసులకు కూడా ఇలాంటి సైన్సు విషయాల జ్ఞానం ఉండేది కాదు. దీనితో ఈ ఖుర్ఆన్ దివ్యాష్కృతి అని నిరూపించబడుతోంది. దాదాపు వేయి కంటే ఎక్కువ ఆయతులలో ఈ విధమైన సైన్సు విషయాలు పేర్కొనబడ్డాయి. వాటిలో కొన్ని ఇప్పుడిప్పుడే పరిశోధించబడి నిరూపించబడ్డాయి. వాటిలో ఒక ఒక్క ఆవిష్కారం కూడా ఖుర్ఆన్ లో పేర్కొనబడ్డ విషయం తప్పని నిరూపించలేదు. ఇంకా ఎన్నో నిరూపించబడనున్నాయి. ఈ కాలపు Modern Astrophysicists లందరి అభిప్రాయం ఏమిటంటే: ఈ విశ్వమంతా ఒకే ఒక మూల ద్రవ్యం హైడ్రోజన్ పరమాణువు నుండి సృష్టించబడింది. తరువాత ఆ హైడ్రోజన్ పరమాణువులు గరుత్వాకర్షణ శక్తి వల్ల కలుపబడి అనేక పదార్థాల సముదాయం ఏర్పడి, తరువాత అది పగల గొట్టబడటం వల్ల Galaxies, Nedulae and Solar Systems, అంటే నక్షత్ర సముదాయం ఏర్పడింది. ఇదంతా జరగటానికి ఎంతో శక్తి (Energy) కావాలి. కాబట్టి, ఇదంతా చేసే శక్తి గలవాడు, సర్వసృష్టికి ఆధార భూతుడైన అల్లాహ్ (సు.తా.) మాత్రమే. ఇంకా చూడండి 51:47. [2] ఈ విషయం కూడా ఇప్పటి సైంటిస్టులందరూ అంగీకరిస్తారు. అంటే ప్రతి జీవి నీటి నుండి పుట్టించబడిందని. జీవకణం (Cell) లోని అత్యధిక భాగం Protoplasm అందులో కూడా అత్యధిక భాగం (దాదాపు 72%) నీరే.
أَوَلَمْ يَرَ ٱلَّذِينَ كَفَرُوٓا۟ أَنَّ ٱلسَّمَٰوَٰتِ وَٱلْأَرْضَ كَانَتَا رَتْقًۭا فَفَتَقْنَٰهُمَا ۖ وَجَعَلْنَا مِنَ ٱلْمَآءِ كُلَّ شَىْءٍ حَىٍّ ۖ أَفَلَا يُؤْمِنُونَ. ﴿30﴾
31 మరియు భూమి వారితో పాటు కదలకుండా ఉండాలని మేము దానిలో స్థిరమైన పర్వతాలను (మేకుల వలే) నాటాము.[1] మరియు వారు (ప్రజలు) మార్గదర్శకత్వం పొందాలని మేము దానిలో విశాలమైన మార్గాలను కూడా ఏర్పాటు చేశాము.
[1] చూడండి, 16:15.
وَجَعَلْنَا فِى ٱلْأَرْضِ رَوَٰسِىَ أَن تَمِيدَ بِهِمْ وَجَعَلْنَا فِيهَا فِجَاجًۭا سُبُلًۭا لَّعَلَّهُمْ يَهْتَدُونَ. ﴿31﴾
32 మరియు మేము ఆకాశాన్ని సురక్షితమైన కప్పుగా చేశాము.[1] అయినా వారు అందులోని సూచనల (ఆయాత్ ల) నుండి విముఖులవుతున్నారు.
[1] చూడండి, 13:2.
وَجَعَلْنَا ٱلسَّمَآءَ سَقْفًۭا مَّحْفُوظًۭا ۖ وَهُمْ عَنْ ءَايَٰتِهَا مُعْرِضُونَ. ﴿32﴾
33 మరియు రేయింబవళ్ళను మరియు సూర్యచంద్రులను సృష్టించినవాడు ఆయనే. అవి తమ తమ కక్ష్యలలో తేలియాడుతూ (తిరుగుతూ) ఉన్నాయి. وَهُوَ ٱلَّذِى خَلَقَ ٱلَّيْلَ وَٱلنَّهَارَ وَٱلشَّمْسَ وَٱلْقَمَرَ ۖ كُلٌّۭ فِى فَلَكٍۢ يَسْبَحُونَ. ﴿33﴾
34 మరియు (ఓ ప్రవక్తా!) నీకు పూర్వం మేము ఏ మానవునికి కూడా శాశ్వత జీవితాన్ని ప్రసాదించలేదు.[1] ఏమీ? ఒకవేళ నీవు మరణిస్తే! వారు మాత్రం శాశ్వతంగా సజీవులుగా (చిరంజీవులుగా) ఉంటారా? [2]
[1] చూడండి, 3:144. [2] చూడండి, 39:30.
وَمَا جَعَلْنَا لِبَشَرٍۢ مِّن قَبْلِكَ ٱلْخُلْدَ ۖ أَفَإِي۟ن مِّتَّ فَهُمُ ٱلْخَٰلِدُونَ. ﴿34﴾
35 ప్రతి ప్రాణి మృత్యువును చవి చూస్తుంది. మరియు మేము మీ అందరినీ, మంచి మరియు చెడు స్థితులకు గురి చేసి, పరీక్షిస్తాము.[1] మరియు మీరందరూ మా వైపునకే మరలింపబడతారు.
[1]మీలో ఎవరు కృతజ్ఞులో మరియు ఎవరు సహనం వహించని కృతఘ్నులో చూడటానికి. మంచి స్థితిలో అల్లాహ్ (సు.తా.) కు కృతజ్ఞులవటం మరియు దురావస్థలో సహనం వహించటమే విశ్వాసుల లక్షణాలు.
كُلُّ نَفْسٍۢ ذَآئِقَةُ ٱلْمَوْتِ ۗ وَنَبْلُوكُم بِٱلشَّرِّ وَٱلْخَيْرِ فِتْنَةًۭ ۖ وَإِلَيْنَا تُرْجَعُونَ. ﴿35﴾
36 మరియు ఈ సత్యతిరస్కారులు నిన్ను చూసినప్పుడల్లా మీతో పరహాసమాడే వైఖరిని మాత్రమే అవలంబిస్తూ (అంటారు):[1] "ఏమీ? మీ ఆరాధ్యదైవాలను గురించి (నిర్లక్ష్యంగా) మాట్లాడే వ్యక్తి ఇతనేనా?" ఇక వారేమో అనంత కరుణామయుని ప్రస్తావన వచ్చినప్పుడు! వారే సత్యాన్ని తిరస్కరిస్తున్నారు.
[1] చూడండి, 25:41.
وَإِذَا رَءَاكَ ٱلَّذِينَ كَفَرُوٓا۟ إِن يَتَّخِذُونَكَ إِلَّا هُزُوًا أَهَٰذَا ٱلَّذِى يَذْكُرُ ءَالِهَتَكُمْ وَهُم بِذِكْرِ ٱلرَّحْمَٰنِ هُمْ كَٰفِرُونَ. ﴿36﴾
37 మానవుడు ఆత్రగాడుగా (తొందర పాటు జీవిగా) పుట్టించబడ్డాడు.[1] త్వరలోనే నేను మీకు నా సూచనలు చూపుతాను, కావున నన్ను తొందరపెట్టకండి.[2]
[1] మానవునికి సహనం లేదు, చూడండి 17:11. [2] చూడండి, 16:1, అంటే తీర్పుదినం రానున్నది.
خُلِقَ ٱلْإِنسَٰنُ مِنْ عَجَلٍۢ ۚ سَأُو۟رِيكُمْ ءَايَٰتِى فَلَا تَسْتَعْجِلُونِ. ﴿37﴾
38 మరియు వారంటున్నారు: "మీరు సత్యవంతులే అయితే ఈ వాగ్దానం (బెదిరింపు) ఎప్పుడు నెరవేరనున్నది.[1]
[1] దీని జవాబుకై చూడండి, 7:187.
وَيَقُولُونَ مَتَىٰ هَٰذَا ٱلْوَعْدُ إِن كُنتُمْ صَٰدِقِينَ. ﴿38﴾
39 ఒకవేళ, ఈ సత్యతిరస్కారులు, ఆ సమయాన్ని గురించి తెలుసుకొని ఉంటే ఎంత బాగుండేది! అప్పుడు వారు ఆ అగ్ని నుండి తమ ముఖాలను గానీ, తమ వీపులను గానీ కాపాడుకోలేరు. మరియు వారికెలాంటి సహాయం కూడా లభించదు. لَوْ يَعْلَمُ ٱلَّذِينَ كَفَرُوا۟ حِينَ لَا يَكُفُّونَ عَن وُجُوهِهِمُ ٱلنَّارَ وَلَا عَن ظُهُورِهِمْ وَلَا هُمْ يُنصَرُونَ. ﴿39﴾
40 వాస్తవంగా, అది వారిపై అకస్మాత్తుగా వచ్చిపడి వారిని కలవర పెడుతుంది.[1] వారు దానిని నివారించనూ లేరు మరియు వారికెలాంటి వ్యవధి కూడా ఇవ్వబడదు.
[1] తబ్ హతు: perplex, stupify, కలవర పెట్టు, చికాకు పరచు, తెలివితేటలను పోగొట్టు.
بَلْ تَأْتِيهِم بَغْتَةًۭ فَتَبْهَتُهُمْ فَلَا يَسْتَطِيعُونَ رَدَّهَا وَلَا هُمْ يُنظَرُونَ. ﴿40﴾
41 మరియు (ఓ ముహమ్మద్!) వాస్తవానికి, నీకు పూర్వం కూడా ప్రవక్తలు ఎగతాళి చేయబడ్డారు, కానీ ఆ వెక్కిరించిన వారిని, వారి ఎగతాళియే చుట్టుకున్నది.[1]
[1] ఇటువంటి ఆయత్ కు చూడండి, 6:10.
وَلَقَدِ ٱسْتُهْزِئَ بِرُسُلٍۢ مِّن قَبْلِكَ فَحَاقَ بِٱلَّذِينَ سَخِرُوا۟ مِنْهُم مَّا كَانُوا۟ بِهِۦ يَسْتَهْزِءُونَ. ﴿41﴾
42 ఇలా అను: "రేయింబవళ్ళు మిమ్మల్ని అనంత కరుణామయుని (శిక్ష) నుండి ఎవడు కాపాడగలడు?" అయినా వారు తమ ప్రభువు స్మరణ నుండి విముఖులవుతున్నారు. قُلْ مَن يَكْلَؤُكُم بِٱلَّيْلِ وَٱلنَّهَارِ مِنَ ٱلرَّحْمَٰنِ ۗ بَلْ هُمْ عَن ذِكْرِ رَبِّهِم مُّعْرِضُونَ. ﴿42﴾
43 లేక! వారిని మా (శిక్ష) నుండి కాపాడటానికి మేము తప్ప వేరే దైవాలు ఎవరైనా ఉన్నారా? వారు (ఆ దైవాలు) తమకు తామే సహాయం చేసుకోలేరు మరియు వారు మా నుండి కాపాడుకోనూ లేరు. أَمْ لَهُمْ ءَالِهَةٌۭ تَمْنَعُهُم مِّن دُونِنَا ۚ لَا يَسْتَطِيعُونَ نَصْرَ أَنفُسِهِمْ وَلَا هُم مِّنَّا يُصْحَبُونَ. ﴿43﴾
44 అయినా! మేము వారికి మరియు వారి తండ్రితాతలకు చాలా కాలం వరకు సుఖసంతోషాలను ఇస్తూ వచ్చాము. అయితే! వారు చూడటం లేదా! వాస్తవానికి, మేము భూమిని , దాని అన్ని వైపుల నుండి తగ్గిస్తున్నామని?[1] అయినా! వారు ఆధిక్యత వహించగలరని భావిస్తున్నారా?
[1] చూడండి, 13:41, అంటే విశ్వాసుల సంఖ్య క్రమక్రమంగా పెరగటం మరియు వారు 'అరబ్ దేశాన్ని ఆక్రమించటం మరియు ముష్రికుల సంఖ్య తగ్గిపోవటం మరియు వారి అధికారంలో నున్న భూమి దినదినానికి తగ్గిపోవటం.
بَلْ مَتَّعْنَا هَٰٓؤُلَآءِ وَءَابَآءَهُمْ حَتَّىٰ طَالَ عَلَيْهِمُ ٱلْعُمُرُ ۗ أَفَلَا يَرَوْنَ أَنَّا نَأْتِى ٱلْأَرْضَ نَنقُصُهَا مِنْ أَطْرَافِهَآ ۚ أَفَهُمُ ٱلْغَٰلِبُونَ. ﴿44﴾
45 (ఓ ముహమ్మద్!) వారితో ఇలా అను: "నేను కేవలం దివ్యజ్ఞానం (వహీ) ఆధారంగానే మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను." కాని చెవిటి వారిని, ఎంత హెచ్చరించినా, వారు పిలుపును వినలేరు కదా! قُلْ إِنَّمَآ أُنذِرُكُم بِٱلْوَحْىِ ۚ وَلَا يَسْمَعُ ٱلصُّمُّ ٱلدُّعَآءَ إِذَا مَا يُنذَرُونَ. ﴿45﴾
46 మరియు ఒకవేళ నీ ప్రభువు శిక్ష, కొంత వారికి పడితే వారు: "అయ్యో! మా పాడుగాను! వాస్తవానికి, మేము దుర్మార్గులముగా ఉండేవారం." అని అంటారు. وَلَئِن مَّسَّتْهُمْ نَفْحَةٌۭ مِّنْ عَذَابِ رَبِّكَ لَيَقُولُنَّ يَٰوَيْلَنَآ إِنَّا كُنَّا ظَٰلِمِينَ. ﴿46﴾
47 మరియు పునరుత్థాన దినమున మేము సరిగ్గా తూచే త్రాసులను ఏర్పాటు చేస్తాము. కావున ఏ వ్యక్తికి కూడా ఏ మాత్రం అన్యాయం జరుగదు. ఒకవేళ ఆవగింజంత కర్మ ఉన్నా మేము దానిని ముందుకు తెస్తాము. మరియు లెక్క చూడటానికి మేమే చాలు! وَنَضَعُ ٱلْمَوَٰزِينَ ٱلْقِسْطَ لِيَوْمِ ٱلْقِيَٰمَةِ فَلَا تُظْلَمُ نَفْسٌۭ شَيْـًۭٔا ۖ وَإِن كَانَ مِثْقَالَ حَبَّةٍۢ مِّنْ خَرْدَلٍ أَتَيْنَا بِهَا ۗ وَكَفَىٰ بِنَا حَٰسِبِينَ. ﴿47﴾
48 మరియు వాస్తవానికి మేము, మూసా మరియు హారూన్ లకు ఒక గీటురాయిని మరియు దివ్యజ్యోతిని (తౌరాత్ ను) ప్రసాదించి ఉన్నాము మరియు దైవభీతి గల వారికి ఒక హితబోధను.[1]
[1] అంటే దివ్యజ్ఞానమే నీతి నిజాయితీలను పరీక్షించే గీటురాయి. కావున అల్లాహ్ (సు.తా.) వరుసగా దివ్యగ్రంథాలను అవతరింపజేశాడు. చూడండి, 2:44 మరియు 2:53.
وَلَقَدْ ءَاتَيْنَا مُوسَىٰ وَهَٰرُونَ ٱلْفُرْقَانَ وَضِيَآءًۭ وَذِكْرًۭا لِّلْمُتَّقِينَ. ﴿48﴾
49 వారి కొరకు ఎవరైతే అగోచరుడైన తమ ప్రభువుకు భయపడతారో![1] మరియు అంతిమ ఘడియను గురించి భీతిపరులై ఉంటారో!
[1] చూడండి, 2:3.
ٱلَّذِينَ يَخْشَوْنَ رَبَّهُم بِٱلْغَيْبِ وَهُم مِّنَ ٱلسَّاعَةِ مُشْفِقُونَ. ﴿49﴾
50 మరియు ఈ శుభప్రదమైన జ్ఞాపిక (ఖుర్ఆన్ ను) మేము అవతరింపజేశాము. ఏమీ? మీరు దీనిని నిరాకరిస్తారా? وَهَٰذَا ذِكْرٌۭ مُّبَارَكٌ أَنزَلْنَٰهُ ۚ أَفَأَنتُمْ لَهُۥ مُنكِرُونَ. ﴿50﴾
51 మరియు వాస్తవానికి, మేము ఇంతకు పూర్వం ఇబ్రాహీమ్ కు కూడా మార్గదర్శకత్వం చేశాము మరియు అతనిని గురించి మాకు బాగా తెలుసు.[1]
[1] ఇబ్రాహీమ్ గాథకు చూడండి, 6:74-79 మరియు 83.
۞ وَلَقَدْ ءَاتَيْنَآ إِبْرَٰهِيمَ رُشْدَهُۥ مِن قَبْلُ وَكُنَّا بِهِۦ عَٰلِمِينَ. ﴿51﴾
52 అతను తన తండ్రి మరియు తన జాతి ప్రజలతో ఇలా అన్నప్పుడు: "మీరు భక్తితో ఆరాధిస్తున్న ఈ విగ్రహాలు ఏమిటి?" إِذْ قَالَ لِأَبِيهِ وَقَوْمِهِۦ مَا هَٰذِهِ ٱلتَّمَاثِيلُ ٱلَّتِىٓ أَنتُمْ لَهَا عَٰكِفُونَ. ﴿52﴾
53 వారన్నారు: "మేము మా తండ్రి తాతలను, వీటినే ఆరాధిస్తూ ఉండగా చూశాము." قَالُوا۟ وَجَدْنَآ ءَابَآءَنَا لَهَا عَٰبِدِينَ. ﴿53﴾
54 (ఇబ్రాహీమ్) అన్నాడు: "వాస్తవానికి, మీరు మరియు మీ తండ్రితాతలు స్పష్టంగా మార్గభ్రష్టత్వంలో పడి ఉన్నారు." قَالَ لَقَدْ كُنتُمْ أَنتُمْ وَءَابَآؤُكُمْ فِى ضَلَٰلٍۢ مُّبِينٍۢ. ﴿54﴾
55 వారన్నారు: "ఏమీ? నీవు మా వద్దకు ఏదైనా సత్యాన్ని తెచ్చావా? లేదా నీవు మాతో పరిహాసమాడుతున్నావా?" قَالُوٓا۟ أَجِئْتَنَا بِٱلْحَقِّ أَمْ أَنتَ مِنَ ٱللَّٰعِبِينَ. ﴿55﴾
56 (ఇబ్రాహీమ్) అన్నాడు: "అలా కాదు! భూమ్యాకాశాల ప్రభువే మీ ప్రభువు! ఆయనే వాటన్నింటినీ సృజించాడు. మరియు నేను ఈ విషయం గురించి మీ ముందు సాక్ష్యమిస్తున్నాను. قَالَ بَل رَّبُّكُمْ رَبُّ ٱلسَّمَٰوَٰتِ وَٱلْأَرْضِ ٱلَّذِى فَطَرَهُنَّ وَأَنَا۠ عَلَىٰ ذَٰلِكُم مِّنَ ٱلشَّٰهِدِينَ. ﴿56﴾
57 "మరియు నేను అల్లాహ్ పై ప్రమాణం చేసి చెబుతున్నాను. మీరు వెళ్ళిపోయిన తరువాత మీ విగ్రహాలకు విరుద్ధంగా తప్పక యుక్తి పన్నుతాను." وَتَٱللَّهِ لَأَكِيدَنَّ أَصْنَٰمَكُم بَعْدَ أَن تُوَلُّوا۟ مُدْبِرِينَ. ﴿57﴾
58 తరువాత అతను ఒక పెద్ద దానిని (విగ్రహాన్ని) తప్ప అన్నింటినీ ముక్కలు ముక్కలుగా చేశాడు; బహుశా వారు దాని వైపునకు మరలుతారని! فَجَعَلَهُمْ جُذَٰذًا إِلَّا كَبِيرًۭا لَّهُمْ لَعَلَّهُمْ إِلَيْهِ يَرْجِعُونَ. ﴿58﴾
59 వారన్నారు: "మా ఆరాధ్య దైవాలతో ఈ విధంగా ప్రవర్తించినవాడెవడు? నిశ్చయంగా వాడు దుర్మార్గుడు." قَالُوا۟ مَن فَعَلَ هَٰذَا بِـَٔالِهَتِنَآ إِنَّهُۥ لَمِنَ ٱلظَّٰلِمِينَ. ﴿59﴾
60 (కొందరు) ఇలా అన్నారు; "ఇబ్రాహీమ్ అనే యువకుడు, వీటిని గురించి ప్రస్తావిస్తూ ఉండగా మేము విన్నాము." قَالُوا۟ سَمِعْنَا فَتًۭى يَذْكُرُهُمْ يُقَالُ لَهُۥٓ إِبْرَٰهِيمُ. ﴿60﴾
61 (ఇతరులు) అన్నారు: "అయితే, అతనిని ప్రజల కళ్ళ ముందుకు తీసుకురండి; బహుశా వారు సాక్ష్యమిస్తారేమో!" قَالُوا۟ فَأْتُوا۟ بِهِۦ عَلَىٰٓ أَعْيُنِ ٱلنَّاسِ لَعَلَّهُمْ يَشْهَدُونَ. ﴿61﴾
62 (అతనిని తెచ్చిన తరువాత) వారు అడిగారు: "ఓ ఇబ్రాహీమ్! ఏమీ? నీవేనా మా ఆరాధ్య దైవాలతో ఇలా వ్యవహరించిన వాడవు?" قَالُوٓا۟ ءَأَنتَ فَعَلْتَ هَٰذَا بِـَٔالِهَتِنَا يَٰٓإِبْرَٰهِيمُ. ﴿62﴾
63 (ఇబ్రాహీమ్) జవాబిచ్చాడు: "కాదు కాదు! వారిలోని ఈ పెద్దవాడే ఇలా చేశాడు! అవి మాట్లాడగలిగితే వాటినే అడగండి!" قَالَ بَلْ فَعَلَهُۥ كَبِيرُهُمْ هَٰذَا فَسْـَٔلُوهُمْ إِن كَانُوا۟ يَنطِقُونَ. ﴿63﴾
64 వారు తమలో తాము సమాలోచనలు చేసుకుంటూ ఇలా అనుకున్నారు: "నిశ్చయంగా స్వయంగా మీరే దుర్మార్గులు!" فَرَجَعُوٓا۟ إِلَىٰٓ أَنفُسِهِمْ فَقَالُوٓا۟ إِنَّكُمْ أَنتُمُ ٱلظَّٰلِمُونَ. ﴿64﴾
65 కాని, తరువాత వారి బుద్ధి తలక్రిందులై వారు ఇలా అన్నారు: "వాస్తవానికి, నీకు తెలుసు కదా, ఇవి మాట్లాడలేవని!" ثُمَّ نُكِسُوا۟ عَلَىٰ رُءُوسِهِمْ لَقَدْ عَلِمْتَ مَا هَٰٓؤُلَآءِ يَنطِقُونَ. ﴿65﴾
66 (ఇబ్రాహీమ్) ఇలా అన్నాడు: "అలా అయితే! మీరు అల్లాహ్ ను వదలి, మీకెలాంటి లాభం కానీ నష్టం కానీ చేకూర్చలేని వాటిని ఆరాధిస్తారా? قَالَ أَفَتَعْبُدُونَ مِن دُونِ ٱللَّهِ مَا لَا يَنفَعُكُمْ شَيْـًۭٔا وَلَا يَضُرُّكُمْ. ﴿66﴾
67 "ధిక్కారం! మీపై మరియు అల్లాహ్ ను వదలి మీరు ఆరాధించే వాటిపై (దైవాలపై)! ఏమీ? మీరు ఏ మాత్రమూ తెలివిని ఉపయోగించరా?" أُفٍّۢ لَّكُمْ وَلِمَا تَعْبُدُونَ مِن دُونِ ٱللَّهِ ۖ أَفَلَا تَعْقِلُونَ. ﴿67﴾
68 వారన్నారు: "మీరేమైనా చేయ దలుచుకుంటే! ఇతనిని కాల్చి వేయండి, మీ ఆరాధ్యదైవాలకు తోడ్పడండి." قَالُوا۟ حَرِّقُوهُ وَٱنصُرُوٓا۟ ءَالِهَتَكُمْ إِن كُنتُمْ فَٰعِلِينَ. ﴿68﴾
69 మేము (అల్లాహ్) ఆజ్ఞాపించాము: "ఓ అగ్నీ! నీవు ఇబ్రాహీమ్ కొరకు చల్లగా సురక్షితంగా అయిపో!"[1]
[1] చూడండి, 29:24 మరియు 37:97.
قُلْنَا يَٰنَارُ كُونِى بَرْدًۭا وَسَلَٰمًا عَلَىٰٓ إِبْرَٰهِيمَ. ﴿69﴾
70 మరియు వారు ఇబ్రాహీమ్ కు కీడు తల పెట్టగోరారు, కాని మేము వారినే నష్టంలో పడవేశాము. وَأَرَادُوا۟ بِهِۦ كَيْدًۭا فَجَعَلْنَٰهُمُ ٱلْأَخْسَرِينَ. ﴿70﴾
71 మరియు మేము అతనిని (ఇబ్రాహీమ్ ను) మరియు లూత్ ను రక్షించి, సర్వజనుల కొరకు శుభప్రదం చేసిన భూమి వైపునకు పంపాము.[1]
[1] లూ'త్ ('అ.స.), ఇబ్రాహీమ్ ('అ.స.) యొక్క సోదరుని కుమారులు. అతను ఇస్లాం స్వీకరించి ఇబ్రాహీమ్ ('అ.స.) తో సహా తమ నగరం 'ఊర్ - ఏదైతే Mesopotamia (ఇరాఖ్)లో ఉందో - విడిచి ఫల'స్తీన్ (సిరియా)కు వెళ్ళారు. అల్లాహ్ (సు.తా.) అతనిని కూడా ప్రవక్తగా ఎన్నుకున్నాడు. లూ'త్ ('అ.స.) సోడోమ్ మరియు గొమొర్రాహ్ ('సద్దూమ్, 'అమూరహ్) ప్రాంతంలో నివసించారరు. అవి ఈ నాటి మృత సముద్రం (Dear Sea) దగ్గర ఉండేవి.
وَنَجَّيْنَٰهُ وَلُوطًا إِلَى ٱلْأَرْضِ ٱلَّتِى بَٰرَكْنَا فِيهَا لِلْعَٰلَمِينَ. ﴿71﴾
72 మరియు అతనికి (ఇబ్రాహీమ్) కు ఇస్ హాఖ్ మరియు యఅఖూబ్ లను అదనపు కానుకగా ప్రసాదించాము.[1] మరియు మేము ప్రతి ఒక్కరినీ సద్వర్తనులుగా చేశాము.
[1] మొదటి కుమారుడు ఇస్మా'యీలు ('అ.స.) కావున ఇస్హా'ఖ్ ('అ.స.) 'అదనపు కానుకగా) అని ఇక్కడ పేర్కొనబడ్డారు. '.
وَوَهَبْنَا لَهُۥٓ إِسْحَٰقَ وَيَعْقُوبَ نَافِلَةًۭ ۖ وَكُلًّۭا جَعَلْنَا صَٰلِحِينَ. ﴿72﴾
73 మరియు మేము వారిని నాయకులుగా చేశాము. వారు ప్రజలకు మా ఆజ్ఞ ప్రకారం మార్గదర్శకత్వం చేస్తూ ఉండేవారు. మరియు మేము వారిపై - సత్కార్యాలు చేయాలని, నమాజ్ స్థాపించాలని, విధిదానం (జకాత్) ఇవ్వాలని - దివ్యజ్ఞానం (వహీ) పంపాము. మరియు వారు (కేవలం) మమ్మల్నే ఆరాధించేవారు. وَجَعَلْنَٰهُمْ أَئِمَّةًۭ يَهْدُونَ بِأَمْرِنَا وَأَوْحَيْنَآ إِلَيْهِمْ فِعْلَ ٱلْخَيْرَٰتِ وَإِقَامَ ٱلصَّلَوٰةِ وَإِيتَآءَ ٱلزَّكَوٰةِ ۖ وَكَانُوا۟ لَنَا عَٰبِدِينَ. ﴿73﴾
74 మరియు (జ్ఞాపకం చేసుకోండి) మేము లూత్ కు[1] వివేకాన్ని మరియు జ్ఞానాన్ని ప్రసాదించాము మరియు మేము అతనిని అసహ్యకరమైన పనులు చేస్తున్న వారి నగరం నుండి కాపాడాము. నిశ్చయంగా వారు నీచులు, అవిధేయులు (ఫాసిఖీన్) అయిన ప్రజలు.
[1] లూ'త్ ('అ.స.) గాథ కొరకు చూడండి, 7:80-84; 11:77-83, 15:58-76.
وَلُوطًا ءَاتَيْنَٰهُ حُكْمًۭا وَعِلْمًۭا وَنَجَّيْنَٰهُ مِنَ ٱلْقَرْيَةِ ٱلَّتِى كَانَت تَّعْمَلُ ٱلْخَبَٰٓئِثَ ۗ إِنَّهُمْ كَانُوا۟ قَوْمَ سَوْءٍۢ فَٰسِقِينَ. ﴿74﴾
75 మరియు మేము అతనిని మా కారుణ్యంలోకి ప్రవేశింప జేసుకున్నాము. నిశ్చయంగా, అతను సద్వర్తనులలోని వాడు. وَأَدْخَلْنَٰهُ فِى رَحْمَتِنَآ ۖ إِنَّهُۥ مِنَ ٱلصَّٰلِحِينَ. ﴿75﴾
76 మరియు (జ్ఞాపకం చేసుకోండి) నూహ్[1] అంతకు ముందు, మమ్మల్ని వేడుకొనగా మేము అతని (ప్రార్థనను) అంగీకరించాము. కావున అతనికి మరియు అతనితో బాటు ఉన్నవారికి ఆ మహా విపత్తు నుండి విముక్తి కలిగించాము.
[1] నూ'హ్ ('అ.స.) గాథ ఖుర్ఆన్ లో ఎన్నోసార్లు వచ్చింది. ముఖ్యంగా చూడండి, 11:25-48.
وَنُوحًا إِذْ نَادَىٰ مِن قَبْلُ فَٱسْتَجَبْنَا لَهُۥ فَنَجَّيْنَٰهُ وَأَهْلَهُۥ مِنَ ٱلْكَرْبِ ٱلْعَظِيمِ. ﴿76﴾
77 మరియు మా సూచనలను అబద్ధాలని నిరాకరించిన వారికి వ్యతిరేకంగా మేము అతనికి సహాయం చేశాము. నిశ్చయంగా, వారు దుష్ట ప్రజలు. కావున వారినందరినీ ముంచి వేశాము. وَنَصَرْنَٰهُ مِنَ ٱلْقَوْمِ ٱلَّذِينَ كَذَّبُوا۟ بِـَٔايَٰتِنَآ ۚ إِنَّهُمْ كَانُوا۟ قَوْمَ سَوْءٍۢ فَأَغْرَقْنَٰهُمْ أَجْمَعِينَ. ﴿77﴾
78 మరియు దావూద్ మరియు సులైమాన్ ఇద్దరు ఒక చేను గురించి తీర్పు చేసిన విషయం (జ్ఞాపకం చేసుకోండి):[1] "ఒక తెగవారి మేకలు (మరొక తెగవారి చేను) మేశాయి. అప్పుడు వాస్తవానికి, మేము వారి తీర్పునకు సాక్షులుగా ఉన్నాము.
[1] ఒక వ్యక్తి మేకలు ఒక రాత్రి మరొక వ్యక్తి పంట పొలాన్ని మేస్తాయి. అతడు, దావూద్ ('అ.స.) దగ్గరకు తీర్పు కొరకు వస్తాడు. అతను ('అ.స.) పంట నష్టానికి సమానమైన విలువ గల మేకలను, పొలం వానికి ఇవ్వాలని తీర్పు ఇస్తారు. ఇది విని అక్కడే ఉన్న అతని ('అ.స.) కుమారులు సులైమాన్ ('అ.స.) అంటారు: 'అలా కాదు! చేను మేకలవానికి ఇవ్వాలి. అతడు సేద్యం చేసి దానిని మేకలు మేయక ముందు ఉన్న స్థితిలోకి పెంచి తీసుకు రావాలి. ఈ కాలమంతా మేకలు చేనువాని దగ్గర ఉండాలి. అతడు వాటి పాలు, ఉన్ని మరియు పిల్లలతో లాభం పొంద వచ్చు. ఎప్పుడైతే చేను మొదటి స్థితిలోకి వస్తుందో అప్పుడు చేనూ, మేకలూ, తమ తమ యజమానులకు తిరిగి ఇవ్వాలి.' ఈ తీర్పు ఎక్కువ ఉచితమైనదై నందుకు, దానినే అమలు చేస్తారు.
وَدَاوُۥدَ وَسُلَيْمَٰنَ إِذْ يَحْكُمَانِ فِى ٱلْحَرْثِ إِذْ نَفَشَتْ فِيهِ غَنَمُ ٱلْقَوْمِ وَكُنَّا لِحُكْمِهِمْ شَٰهِدِينَ. ﴿78﴾
79 అసలు సులైమాన్ కు మేము (వాస్తవ విషయం) తెలియజేశాము. మరియు వారిద్దరికీ మేము వివేకాన్ని మరియు జ్ఞానాన్ని ప్రసాదించాము. మరియు మేము పర్వతాలను మరియు పక్షులను దావూద్ తో బాటు మా స్తోత్రం చేయటానికి లోబరిచాము.[1] మరియు నిశ్చయంగా, మేమే (ప్రతిదీ) చేయగలవారము.
[1] చూడండి, 17:44, 57:1 మరియు 13:13.
فَفَهَّمْنَٰهَا سُلَيْمَٰنَ ۚ وَكُلًّا ءَاتَيْنَا حُكْمًۭا وَعِلْمًۭا ۚ وَسَخَّرْنَا مَعَ دَاوُۥدَ ٱلْجِبَالَ يُسَبِّحْنَ وَٱلطَّيْرَ ۚ وَكُنَّا فَٰعِلِينَ. ﴿79﴾
80 మరియు మేము అతనికి, మీ యుద్ధాలలో, మీ రక్షణ కొరకు కవచాలు తయారు చేయడం నేర్పాము. అయితే! (ఇప్పుడైనా) మీరు కృతజ్ఞులవుతారా? وَعَلَّمْنَٰهُ صَنْعَةَ لَبُوسٍۢ لَّكُمْ لِتُحْصِنَكُم مِّنۢ بَأْسِكُمْ ۖ فَهَلْ أَنتُمْ شَٰكِرُونَ. ﴿80﴾
81 మరియు మేము తీవ్రంగా వీచే గాలిని సులైమాన్ కు (వశపరిచాము). అది అతని ఆజ్ఞతో మేము శుభాలను ప్రసాదించిన (అనుగ్రహించిన) భూమి మీద వీచేది.[1] మరియు నిశ్చయంగా, మాకు ప్రతి విషయం గురించి బాగా తెలుసు.
[1] ఈ భూమి ఆ కాలపు షామ్, అంటే కాలపు ఫల'స్తీన్, జోర్డాన్ మరియు సిరియాలు.
وَلِسُلَيْمَٰنَ ٱلرِّيحَ عَاصِفَةًۭ تَجْرِى بِأَمْرِهِۦٓ إِلَى ٱلْأَرْضِ ٱلَّتِى بَٰرَكْنَا فِيهَا ۚ وَكُنَّا بِكُلِّ شَىْءٍ عَٰلِمِينَ. ﴿81﴾
82 మరియు షైతానులలో కొందరు అతని (సులైమాన్) కొరకు (సముద్రంలో) మునిగే వారు మరియు ఇతర పనులు కూడా చేసేవారు. మరియు నిశ్చయంగా, మేమే వారిని కనిపెట్టుకొని ఉండేవారము. وَمِنَ ٱلشَّيَٰطِينِ مَن يَغُوصُونَ لَهُۥ وَيَعْمَلُونَ عَمَلًۭا دُونَ ذَٰلِكَ ۖ وَكُنَّا لَهُمْ حَٰفِظِينَ. ﴿82﴾
83 మరియు (జ్ఞాపకం చేసుకోండి) అయ్యూబ్ తన ప్రభువును వేడుకున్నప్పుడు (ఇలా అన్నాడు): "నిశ్చయంగా, నన్ను బాధ (వ్యాధి) చుట్టుకున్నది. మరియు నీవే కరుణామయులలో కెల్లా గొప్ప కరుణామయుడవు.!"[1]
[1] అయ్యూబ్ ('అ.స.) మొదట, సుఖసంతోషాలలో జీవితం గడిపారు. తరువాత అల్లాహ్ (సు.తా.) అతనిని తీవ్రమైన కష్టాలతో, వ్యాధితో పరీక్షించాడు. అతను, ఆ కష్ట కాలంలో కూడా సహనం వహించారు. ఆ తరువాత అల్లాహ్ (సు.తా.) అతనిని అనుగ్రహించి మరల మొదటి కంటే మంచి స్థితికి తెచ్చాడు. చూడండి, 38:44.
۞ وَأَيُّوبَ إِذْ نَادَىٰ رَبَّهُۥٓ أَنِّى مَسَّنِىَ ٱلضُّرُّ وَأَنتَ أَرْحَمُ ٱلرَّٰحِمِينَ. ﴿83﴾
84 అప్పుడు మేము అతని (ప్రార్థనలు) అంగీకరించి, అతని బాధ నుండి అతనికి విముక్తి కలిగించాము. మరియు అతనికి, అతని కుటుంబ వాసులను తిరిగి ఇవ్వటమే గాక వారితో బాటు ఇంకా అంతమందిని ఎక్కువగా ఇచ్చి, దానిని మా నుండి ఒక ప్రత్యేక కరుణగా మరియు మమ్మల్ని ఆరాధించే వారికి ఒక జ్ఞాపికగా చేశాము. فَٱسْتَجَبْنَا لَهُۥ فَكَشَفْنَا مَا بِهِۦ مِن ضُرٍّۢ ۖ وَءَاتَيْنَٰهُ أَهْلَهُۥ وَمِثْلَهُم مَّعَهُمْ رَحْمَةًۭ مِّنْ عِندِنَا وَذِكْرَىٰ لِلْعَٰبِدِينَ. ﴿84﴾
85 మరియు (జ్ఞాపకం చేసుకోండి), ఇస్మాయీల్, ఇద్రీస్ మరియు జుల్కిప్ల్,[1] వీరందరు కూడా సహన శీలురైన వారే!
[1] జు'ల్ కిఫ్ల ('అ.స.): ప్రవక్తేనా కాదా అనే విషయం గురించి వ్యాఖ్యాతలలో భేదాభిప్రాయాలు ఉన్నాయి. ఇబ్నె-కసీర్ (ర'హ్మ) అంటారు: అతని పేరు ఇతర ప్రవక్త ('అలైహిమ్ స.) ల పేర్లతో పాటు వచ్చింది కాబట్టి అతను కూడా ప్రవక్తయే!
وَإِسْمَٰعِيلَ وَإِدْرِيسَ وَذَا ٱلْكِفْلِ ۖ كُلٌّۭ مِّنَ ٱلصَّٰبِرِينَ. ﴿85﴾
86 మరియు మేము వారందరినీ మా కారుణ్యంలోకి తీసుకున్నాము. నిశ్చయంగా, వారందరూ సద్వర్తనులు. وَأَدْخَلْنَٰهُمْ فِى رَحْمَتِنَآ ۖ إِنَّهُم مِّنَ ٱلصَّٰلِحِينَ. ﴿86﴾
87 మరియు (జ్ఞాపకం చేసుకోండి) చేపవాడు (యూసుస్)[1] - ఉద్రేకంతో వెళ్ళిపోతూ - మేము అతనిని పట్టుకోలేమని అనుకున్నాడు! కాని ఆ తరువాత, అంధకారాలలో చిక్కుకొని పోయినప్పుడు, ఇలా మొరపెట్టుకున్నాడు: "వాస్తవానికి నీవు (అల్లాహ్) తప్ప మరొక ఆరాధ్య దేవుడు లేడు, నీవు సర్వలోపాలకు అతీతుడవు, నిశ్చయంగా, నేనే అపరాధులలోని వాడను."
[1] యూనుస్ ('అ.స.) తన ప్రజల సత్యతిరస్కారాన్ని ఓర్చుకోలేక అల్లాహ్ (సు.తా.) అనుమతించక ముందే వారిని విడిచి పారి పోయి పడవనెక్కారు. అతను చీటీలలో ఓడిపోయి, పడవను మునిగి పోకుండా కాపాడటానికి, సముద్రంలోకి దూకారు. అల్లాహ్ (సు.తా.) ఆజ్ఞతో అతనిని ఒక పెద్ద చేప మ్రింగింది. అతను ('అ.స.) ఆ చేప కడుపులో తమ ప్రభువు (అల్లాహుతా'లా) ను వేడుకున్నారు. అప్పుడు అల్లాహ్ (సు.తా.) అతనిని తిరిగి ఒడ్డు మీదికి చేర్చాడు. అతను ('అ.స.) తిరిగి వెళ్ళి తన ప్రజలకు హితబోధ చేశారు. వివరాలకు చూడండి, 37:139-148 మరియు 10:98.
وَذَا ٱلنُّونِ إِذ ذَّهَبَ مُغَٰضِبًۭا فَظَنَّ أَن لَّن نَّقْدِرَ عَلَيْهِ فَنَادَىٰ فِى ٱلظُّلُمَٰتِ أَن لَّآ إِلَٰهَ إِلَّآ أَنتَ سُبْحَٰنَكَ إِنِّى كُنتُ مِنَ ٱلظَّٰلِمِينَ. ﴿87﴾
88 అప్పుడు మేము అతని (ప్రార్థనను) అంగీకరించి, అతనిని ఆ దుఃఖము నుండి విముక్తి కలిగించాము మరియు విశ్వసించిన వారిని మేము ఇదే విధంగా కాపాడుతూ ఉంటాము. فَٱسْتَجَبْنَا لَهُۥ وَنَجَّيْنَٰهُ مِنَ ٱلْغَمِّ ۚ وَكَذَٰلِكَ نُۨجِى ٱلْمُؤْمِنِينَ. ﴿88﴾
89 మరియు (జ్ఞాపకం చేసుకోండి), జకరియ్యా[1] తన ప్రభువును వేడుకున్నప్పుడు ఇలా ప్రార్థించాడు: "ఓ నా ప్రభూ! నన్ను ఒంటరివానిగా (సంతానహీనునిగా) వదలకు. నీవే సర్వశ్రేష్ఠమైన వారసుడవు!"
[1] 'జకరియ్యా ('అ.స.) గాథకు చూడండి, 3:37 19:2 మరియు సూరహ్ తా'హా (20).
وَزَكَرِيَّآ إِذْ نَادَىٰ رَبَّهُۥ رَبِّ لَا تَذَرْنِى فَرْدًۭا وَأَنتَ خَيْرُ ٱلْوَٰرِثِينَ. ﴿89﴾
90 అప్పుడు మేము అతని ప్రార్థనను అంగీకరించి అతని కొరకు అతని భార్యను (సంతానానికి) యోగ్యురాలుగా చేసి, అతనికి యహ్యాను ప్రసాదించాము. వాస్తవానికి వారు సత్కార్యాలు చేయటానికి పోటీ పడే వారు. మరియు శ్రద్ధతో మరియు భీతితో మమ్మల్ని ఆరాధించేవారు. మరియు మా సమక్షంలో వినమ్రులై ఉండేవారు. فَٱسْتَجَبْنَا لَهُۥ وَوَهَبْنَا لَهُۥ يَحْيَىٰ وَأَصْلَحْنَا لَهُۥ زَوْجَهُۥٓ ۚ إِنَّهُمْ كَانُوا۟ يُسَٰرِعُونَ فِى ٱلْخَيْرَٰتِ وَيَدْعُونَنَا رَغَبًۭا وَرَهَبًۭا ۖ وَكَانُوا۟ لَنَا خَٰشِعِينَ. ﴿90﴾
91 మరియు (జ్ఞాపకం చేసుకోండి), తన శీలాన్ని కాపాడుకున్న ఆ మహిళ (మర్యమ్) లో మా నుండి ప్రాణం (రూహ్) ఊది, ఆమెను మరియు ఆమె కొడుకును, సర్వలోకాల వారికి ఒక సూచనగా చేశాము.[1]
[1] చూడండి, 15:29, 38:72 మరియు 32:9.
وَٱلَّتِىٓ أَحْصَنَتْ فَرْجَهَا فَنَفَخْنَا فِيهَا مِن رُّوحِنَا وَجَعَلْنَٰهَا وَٱبْنَهَآ ءَايَةًۭ لِّلْعَٰلَمِينَ. ﴿91﴾
92 నిశ్చయంగా,మీ ఈ సమాజం ఒకే ఒక్క సమాజం[1] మరియు కేవలం నేనే మీ ప్రభువును, కావున మీరు నన్ను మాత్రమే ఆరాధించండి.
[1] ఉమ్మతున్: అంటే ధర్మం లేక సమాజం. ఇక్కడ ఇస్లాం ధర్మం మరియు సమాజం. దీని వైపునకే ప్రవక్తలందరూ తమ ప్రజలను ఆహ్వానించారు. ప్రవక్తలందరి ధర్మం ఇస్లామే! దైవప్రవక్త ప్రవచనం: 'ప్రవక్తలందరి కుటుంబం ఒక్కటే, మా తండ్రి ఒక్కడు మరియు మా తల్లులు వేరు వేరు. మా అందరి ధర్మం ఒక్కటే, ఇస్లాం.' (ఇబ్నె-కసీ'ర్).
إِنَّ هَٰذِهِۦٓ أُمَّتُكُمْ أُمَّةًۭ وَٰحِدَةًۭ وَأَنَا۠ رَبُّكُمْ فَٱعْبُدُونِ. ﴿92﴾
93 కాని వారు (ప్రజలు) తమ ధర్మ విషయంలో తెగలు తెగలుగా చీలిపోయారు. వారందరికీ మా వైపునకే మరలి రావలసి వున్నది. وَتَقَطَّعُوٓا۟ أَمْرَهُم بَيْنَهُمْ ۖ كُلٌّ إِلَيْنَا رَٰجِعُونَ. ﴿93﴾
94 సత్కార్యాలు చేసేవాడు విశ్వసించేవాడై ఉంటే, అతని శ్రమ నిరాదరించబడదు మరియు నిశ్చయంగా, మేము దానిని వ్రాసి పెడతాము. فَمَن يَعْمَلْ مِنَ ٱلصَّٰلِحَٰتِ وَهُوَ مُؤْمِنٌۭ فَلَا كُفْرَانَ لِسَعْيِهِۦ وَإِنَّا لَهُۥ كَٰتِبُونَ. ﴿94﴾
95 మరియు మేము నాశనం చేసిన ప్రతి నగరం (వారి)పై, వారు (ఆ నగరవాసులు) మరలి రావటం నిషేధించబడింది. وَحَرَٰمٌ عَلَىٰ قَرْيَةٍ أَهْلَكْنَٰهَآ أَنَّهُمْ لَا يَرْجِعُونَ. ﴿95﴾
96 ఎంత వరకైతే యాజూజ్ మరియు మాజూజ్ లు వదలి పెట్టబడి ప్రతి మిట్టనుండి పరుగెడుతూరారో![1]
[1] చూడండి, 18:94-98. తీర్పుదినం దగ్గరికి వచ్చి 'ఈసా ( 'అ.స.) తిరిగి భూలోకంలోకి వచ్చినప్పుడు యూ'జూజ్ మరియు మా'జూజ్ లు ప్రపంచంలో ప్రతిచోట వ్యాపించి ఉంటారు. వారి హింసలు మరియు దౌర్జన్యాలకు విశ్వాసులు తాళ లేకపోతారు. చివరకు 'ఈసా ('అ.స.) విశ్వాసులను తీసుకొని 'తూర్ పర్వతం పైకి ఎక్కుతారు. అతను యా'జూజ్ మరియు మా'జూజ్ లను శిక్షించటానికి అల్లాహ్ (సు.తా.)ను ప్రార్థిస్తారు. అప్పుడు వారంతా వధింపబడతారు. వారి శవాల దుర్వాసన అంతటా వ్యాపించి పోతుంది. అప్పుడు అల్లాహ్ (సు.తా.) పక్షులను పంపుతాడు. అవి ఆ శవాలను సముద్రంలోకి విసరుతాయి. ఆ తరువాత ఒక పెద్ద వర్షం కురుస్తుంది. దానితో భూమి శుభ్రపరచబడుతుంది. ('స'హీ'హ్ 'హదీస్'ల ఆధారంగా, ఇబ్నె-కసీ'ర్).
حَتَّىٰٓ إِذَا فُتِحَتْ يَأْجُوجُ وَمَأْجُوجُ وَهُم مِّن كُلِّ حَدَبٍۢ يَنسِلُونَ. ﴿96﴾
97 మరియు సత్యవాగ్దానం నెరవేరే సమయం దగ్గర పడినప్పుడు సత్యతిరస్కారుల కళ్ళు విచ్చుకుపోయి: "అయ్యో! మా దౌర్భాగ్యం! వాస్తవానికి మేము దీని నుండి అశ్రద్ధకు గురి అయ్యాము. కాదు కాదు! మేము దుర్మార్గులముగా ఉండేవారము." అని అంటారు. وَٱقْتَرَبَ ٱلْوَعْدُ ٱلْحَقُّ فَإِذَا هِىَ شَٰخِصَةٌ أَبْصَٰرُ ٱلَّذِينَ كَفَرُوا۟ يَٰوَيْلَنَا قَدْ كُنَّا فِى غَفْلَةٍۢ مِّنْ هَٰذَا بَلْ كُنَّا ظَٰلِمِينَ. ﴿97﴾
98 (వారితో ఇంకా ఇలా అనబడుతుంది): "నిశ్చయంగా, మీరు మరియు అల్లాహ్ ను వదలి మీరు ఆరాధించేవారూ, నరకాగ్నికి ఇంధనమవుతారు! (ఎందుకంటే) మీకు అక్కడికే పోవలసి ఉన్నది.[1]
[1] ఒక 'హదీస్' ప్రకారం ఈ ఆయత్ విని ఒక ముష్రికుల నాయకుడు అన్నాడు: 'యూదులు మరియు క్రైస్తవులు ఆరాధించే 'ఉ'జైర్ ('అ.స.) మరియు 'ఈసా ('అ.స.) లు కూడా నరకానికి పోతారా+?' దానికి దైవప్రవక్త ('సఅ'స) అన్నారు: 'అల్లాహ్ (సు.తా.)కు బదులుగా తనను ఆరాధించటాన్ని సమ్మతించిన ప్రతి వ్యక్తి, తనను ఆరాధించిన వారితో పాటు నరకానికి పోతాడు.'
إِنَّكُمْ وَمَا تَعْبُدُونَ مِن دُونِ ٱللَّهِ حَصَبُ جَهَنَّمَ أَنتُمْ لَهَا وَٰرِدُونَ. ﴿98﴾
99 ఒకవేళ ఇవన్నీ ఆరాధ్య దైవాలే అయి వుంటే, ఇవి అందులో (నరకంలో) ప్రవేశించి ఉండేవి కావు కదా! ఇక మీరంతా అందులోనే శాశ్వతంగా ఉంటారు!" لَوْ كَانَ هَٰٓؤُلَآءِ ءَالِهَةًۭ مَّا وَرَدُوهَا ۖ وَكُلٌّۭ فِيهَا خَٰلِدُونَ. ﴿99﴾
100 అందులో వారు (దుఃఖం చేత) మూలుగుతూ ఉంటారు. అందులో వారేమి వినలేరు.[1]
[1] నరకంలో వారంతా బాధల వల్ల ఏడుస్తూ ఉంటారు. వారి రోధనల ధ్వని వల్ల వారందు ఏమీ వినలేక పోతారు.
لَهُمْ فِيهَا زَفِيرٌۭ وَهُمْ فِيهَا لَا يَسْمَعُونَ. ﴿100﴾
101 నిశ్చయంగా, ఎవరి కొరకైతే మా తరఫు నుండి మేలు (స్వర్గం) నిర్ణయింపబడివుందో, అలాంటి వారు దాని (నరకం) నుండి దూరంగా ఉంచబడతారు. إِنَّ ٱلَّذِينَ سَبَقَتْ لَهُم مِّنَّا ٱلْحُسْنَىٰٓ أُو۟لَٰٓئِكَ عَنْهَا مُبْعَدُونَ. ﴿101﴾
102 వారు దాని మెల్లని శబ్దం కూడా వినరు. వారు తాము కోరిన వాటిలో శాశ్వతంగా ఉంటారు. لَا يَسْمَعُونَ حَسِيسَهَا ۖ وَهُمْ فِى مَا ٱشْتَهَتْ أَنفُسُهُمْ خَٰلِدُونَ. ﴿102﴾
103 ఆ గొప్ప భీతి కూడా వారికి దుఃఖం కలిగించదు[1] మరియు దైవదూతలు వారిని ఆహ్వానిస్తూ వచ్చి: "మీకు వాగ్దానం చేయబడిన మీ దినం ఇదే!" అని అంటారు.
[1] ఆ గొప్ప భీతి అంటే ఇస్రాఫీల్ ('అ.స.) యొక్క 'సూర్, లేక స్వర్గ-నరకాల మధ్య 'చావు'ను వధించటం. అంటే స్వర్గానికి మరియు నరకానికి పోయే వారి తీర్పు ముగిసిన తరువాత 'చావు' ఒక గొర్రె ఆకారంలో తెచ్చి జి'బహ్ చేయడం. ఆ తరువాత ఎవ్వరికీ చావు ఉండదు. చూడండి, 19:39.
لَا يَحْزُنُهُمُ ٱلْفَزَعُ ٱلْأَكْبَرُ وَتَتَلَقَّىٰهُمُ ٱلْمَلَٰٓئِكَةُ هَٰذَا يَوْمُكُمُ ٱلَّذِى كُنتُمْ تُوعَدُونَ. ﴿103﴾
104 (జ్ఞాపకముంచుకోండి)! ఆ రోజు మేము ఆకాశాన్ని, చిట్టాకాగితాలను (ఖాతా గ్రంథాలను) చుట్టినట్టు చుట్టివేస్తాము.[1] మేము ఏ విధంగా సృష్టిని మొదట ఆరంభించామో! అదే విధంగా దానిని మరల ఉనికిలోకి తెస్తాము. ఇది (మాపై బాధ్యతగా) ఉన్న మా వాగ్దానం మేము దానిని తప్పక పూర్తి చేస్తాము.
[1] చూడండి, 39:67.
يَوْمَ نَطْوِى ٱلسَّمَآءَ كَطَىِّ ٱلسِّجِلِّ لِلْكُتُبِ ۚ كَمَا بَدَأْنَآ أَوَّلَ خَلْقٍۢ نُّعِيدُهُۥ ۚ وَعْدًا عَلَيْنَآ ۚ إِنَّا كُنَّا فَٰعِلِينَ. ﴿104﴾
105 వాస్తవానికి మేము జబూర్ లో- మా హితబోధ తరువాత - నిశ్చయంగా, ఈ భూమికి[1] సద్వర్తునులైన నా దాసులు వారసులవుతారని వ్రాసి ఉన్నాము.
[1] ఇక్కడ భూమి అంటే స్వర్గమని అనేక వ్యాఖ్యాతల అభిప్రాయం.
وَلَقَدْ كَتَبْنَا فِى ٱلزَّبُورِ مِنۢ بَعْدِ ٱلذِّكْرِ أَنَّ ٱلْأَرْضَ يَرِثُهَا عِبَادِىَ ٱلصَّٰلِحُونَ. ﴿105﴾
106 నిశ్చయంగా ఇందులో భక్తిపరులైన ప్రజలకు సందేశం ఉంది.[1]
[1] దైవప్రవక్త ము'హమ్మద్ ('స.అస) పై అవతరింపజేయబడిన ఈ ఖుర్ఆన్ సర్వమానవాళి కొరకు అవతరింపజేయబడిన దివ్యగ్రంథం. అల్లాహ్ (సు.తా.) దీనిని తీర్పుదినం వరకు భద్రంగా ఉంచుతానని, అన్నాడు. (చూడండి, 15:9). ఇది రంగు రూపాల, పుట్టుపూర్వోత్తరాల, భేదభావాలు లేకుండా సర్వమానవులను ఆకర్షిస్తుంది. ఇది మానవుని హేతువాదానికి జవాబిస్తుంది. మరొక విశేషమేమిటంటే 1400 సంవత్సరాలలో ఒక్క అక్షరం కూడా మార్చబడకుండా ఉన్న ఒకే ఒక్క దివ్యగ్రంథం, ఈ ఖుర్ఆన్ మాత్రమే మరియు ఇది అవతరింపజేయబడిన ప్రవక్త ము'హమ్మద్ ('స'అస) చివరి ప్రవక్త. చూడండి, 33:40
إِنَّ فِى هَٰذَا لَبَلَٰغًۭا لِّقَوْمٍ عَٰبِدِينَ. ﴿106﴾
107 మరియు మేము నిన్ను (ఓ ప్రవక్తా!) సర్వలోకాల వారి కొరకు కారుణ్యంగా మాత్రమే పంపాము.[1]
[1] దైవప్రవక్త ము'హమ్మద్ ('స'అస) సర్వమానవజాతి కొరకు పంపబడిన దైవప్రవక్త చూడండి, 7:158. దైవప్రవక్త ('స'అస) ముష్రికులను శపించలేదు. ('స'హీ'హ్ ముస్లిం, 2006).
وَمَآ أَرْسَلْنَٰكَ إِلَّا رَحْمَةًۭ لِّلْعَٰلَمِينَ. ﴿107﴾
108 (ఓ ముహమ్మద్!) ఇలా అను: "నిశ్చయంగా, నాపై దివ్యజ్ఞానం (వహీ) అవతరింప జేయబడింది. వాస్తవంగా మీ ఆరాధ్య దైవం ఆ అద్వితీయ ఆరాధ్యుడే (అల్లాహ్ యే)! ఇకనైన మీరు అల్లాహ్ కు విధేయులు (ముస్లింలు) అవుతారా? قُلْ إِنَّمَا يُوحَىٰٓ إِلَىَّ أَنَّمَآ إِلَٰهُكُمْ إِلَٰهٌۭ وَٰحِدٌۭ ۖ فَهَلْ أَنتُم مُّسْلِمُونَ. ﴿108﴾
109 ఒకవేళ వారు వెనుదిరిగితే వారితో ఇలా అను: "నేను మీకు అందరికి బహిరంగంగా ప్రకటిస్తున్నాను. మరియు మీతో చేయబడిన వాగ్దానం సమీపంలో ఉందో లేదా బహుదూరం ఉందో నాకు తెలియదు." فَإِن تَوَلَّوْا۟ فَقُلْ ءَاذَنتُكُمْ عَلَىٰ سَوَآءٍۢ ۖ وَإِنْ أَدْرِىٓ أَقَرِيبٌ أَم بَعِيدٌۭ مَّا تُوعَدُونَ. ﴿109﴾
110 నిశ్చయంగా, ఆయన (అల్లాహ్)కు మీరు బహిరంగంగా వ్యక్త పరిచేది మరియు దాచేది అంతా తెలుసు. إِنَّهُۥ يَعْلَمُ ٱلْجَهْرَ مِنَ ٱلْقَوْلِ وَيَعْلَمُ مَا تَكْتُمُونَ. ﴿110﴾
111 మరియు బహుశా ఇది (ఈ ఆలస్యం) మీకు పరీక్ష కావచ్చు, లేదా మీకు కొంతకాలం సుఖసంతోషాలు అనుభవించటానికి ఇవ్వబడిన వ్యవధి కావచ్చు, అది నాకు తెలియదు! وَإِنْ أَدْرِى لَعَلَّهُۥ فِتْنَةٌۭ لَّكُمْ وَمَتَٰعٌ إِلَىٰ حِينٍۢ. ﴿111﴾
112 అతను (ముహమ్మద్) ఇలా అన్నాడు: "ఓ నా ప్రభూ! నీవు సత్యంతో తీర్పు చేయి! మరియు మీరు కల్పించే వాటికి (ఆరోపణలకు), ఆ అపార కరుణామయుడైన మా ప్రభువు సహాయమే కోరబడుతుంది.!" قَٰلَ رَبِّ ٱحْكُم بِٱلْحَقِّ ۗ وَرَبُّنَا ٱلرَّحْمَٰنُ ٱلْمُسْتَعَانُ عَلَىٰ مَا تَصِفُونَ. ﴿112﴾