الواقعة
తెలుగు Translation with Arabic Quran Text
| తెలుగు | العربية |
|---|---|
|
1
ఆ అనివార్య సంఘటన సంభవించినపుడు,[1]
[1] అనివార్య సంఘటన అంటే, అంతిమ ఘడియ, పునరుత్థాన దినం.
|
إِذَا وَقَعَتِ ٱلْوَاقِعَةُ. ﴿1﴾ |
| 2 అది సంభవించటంలో ఎలాంటి సందేహం (అసత్యం) లేదు. | لَيْسَ لِوَقْعَتِهَا كَاذِبَةٌ. ﴿2﴾ |
|
3
అది కొందరిని హీనపరుస్తుంది, మరికొందరిని పైకెత్తుతుంది[1].
[1] అల్లాహ్ (సు.తా.) ఆజ్ఞలను అనుసరించిన వారు పైకెత్తబడతారు. వాటిని తిరస్కరించిన వారు హీనపరచబడతారు.
|
خَافِضَةٌۭ رَّافِعَةٌ. ﴿3﴾ |
| 4 భూమి తీవ్ర కంపనంతో కంపించినపుడు; | إِذَا رُجَّتِ ٱلْأَرْضُ رَجًّۭا. ﴿4﴾ |
| 5 మరియు పర్వతాలు పొడిగా మార్చబడినపుడు; | وَبُسَّتِ ٱلْجِبَالُ بَسًّۭا. ﴿5﴾ |
| 6 అప్పుడు వాటి దుమ్ము నలువైపులా నిండి పోయినపుడు; | فَكَانَتْ هَبَآءًۭ مُّنۢبَثًّۭا. ﴿6﴾ |
| 7 మరియు మీరు మూడు వర్గాలుగా విభజింపబడతారు. | وَكُنتُمْ أَزْوَٰجًۭا ثَلَٰثَةًۭ. ﴿7﴾ |
|
8
ఇక కుడిపక్షం వారు, ఆ కుడిపక్షము వారు ఎంత (అదృష్టవంతులు)![1]
[1] కుడిపక్షం వారంటే తమ కర్మపత్రాలు కుడిచేతిలో ఇవ్వబడేవారు. అంటే స్వర్గానికి అర్హులైనవారు. చూడండి, 74:39.
|
فَأَصْحَٰبُ ٱلْمَيْمَنَةِ مَآ أَصْحَٰبُ ٱلْمَيْمَنَةِ. ﴿8﴾ |
|
9
మరికొందరు వామపక్షం వారుంటారు, ఆ వామపక్షపు వారు ఎంత (దౌర్భాగ్యులు)![1]
[1] వారు (ఎడమ) పక్షంవారు అంటే తమ కర్మపత్రాలు ఎడమ చేతిలో ఇవ్వబడినవారు. అంటే నరకానికి అర్హులైన వారు. చూడండి, 90:19.
|
وَأَصْحَٰبُ ٱلْمَشْـَٔمَةِ مَآ أَصْحَٰبُ ٱلْمَشْـَٔمَةِ. ﴿9﴾ |
| 10 మరియు (ఇహలోకంలో విశ్వాసంలో) ముందున్న వారు (స్వర్గంలో కూడా) ముందుంటారు. | وَٱلسَّٰبِقُونَ ٱلسَّٰبِقُونَ. ﴿10﴾ |
| 11 అలాంటి వారు (అల్లాహ్) సాన్నిధ్యాన్ని పొందుతారు. | أُو۟لَٰٓئِكَ ٱلْمُقَرَّبُونَ. ﴿11﴾ |
| 12 వారు సర్వసుఖాలు గల స్వర్గవనాలలో ఉంటారు. | فِى جَنَّٰتِ ٱلنَّعِيمِ. ﴿12﴾ |
| 13 మొదటి తరాల వారిలో నుండి చాలా మంది; | ثُلَّةٌۭ مِّنَ ٱلْأَوَّلِينَ. ﴿13﴾ |
| 14 మరియు తరువాత తరాల వారిలో నుండి కొంతమంది. | وَقَلِيلٌۭ مِّنَ ٱلْءَاخِرِينَ. ﴿14﴾ |
| 15 (బంగారు) జలతారు అల్లిన ఆసనాల మీద; | عَلَىٰ سُرُرٍۢ مَّوْضُونَةٍۢ. ﴿15﴾ |
|
16
ఒకరికొకరు ఎదురెదురుగా, వాటి మీద దిండ్లకు ఆనుకొని కూర్చొని ఉంటారు.[1]
[1] చూడండి, 15:47.
|
مُّتَّكِـِٔينَ عَلَيْهَا مُتَقَٰبِلِينَ. ﴿16﴾ |
| 17 వారి చుట్టుప్రక్కలలో చిరంజీవులైన (నిత్యబాల్యం గల) బాలురు (సేవకులు) తిరుగుతూ ఉంటారు. | يَطُوفُ عَلَيْهِمْ وِلْدَٰنٌۭ مُّخَلَّدُونَ. ﴿17﴾ |
| 18 (మధువు) ప్రవహించే చెలమల నుండి నింపిన పాత్రలు, గిన్నెలు మరియు కప్పులతో! | بِأَكْوَابٍۢ وَأَبَارِيقَ وَكَأْسٍۢ مِّن مَّعِينٍۢ. ﴿18﴾ |
| 19 దాని వలన వారికి తలనొప్పి గానీ లేక మత్తు గానీ కలుగదు. | لَّا يُصَدَّعُونَ عَنْهَا وَلَا يُنزِفُونَ. ﴿19﴾ |
| 20 మరియు వారు కోరే పండ్లు, ఫలాలు ఉంటాయి. | وَفَٰكِهَةٍۢ مِّمَّا يَتَخَيَّرُونَ. ﴿20﴾ |
|
21
మరియు వారు ఇష్టపడే పక్షుల మాంసం.[1]
[1] 'నేను నా సద్వర్తనులైన దాసుల కొరకు సిద్ధ పరచి ఉంచిన దాన్ని ఇంతవరకూ ఏ కన్నూ చూడలేదు, ఏ చెవీ వినలేదు ఏ మానవ హృదయము (మనస్సు) కూడా ఊహించలేదు.' (బు'ఖారీ, ముస్లిం, తిర్మిజీ - అబూ హురైరహ్ కథనం, ఇంకా చూడండి, 32:17).
|
وَلَحْمِ طَيْرٍۢ مِّمَّا يَشْتَهُونَ. ﴿21﴾ |
| 22 మరియు అందమైన కన్నులు గల సుందరాంగులు (హూరున్); | وَحُورٌ عِينٌۭ. ﴿22﴾ |
| 23 దాచబడిన ముత్యాల వలే! | كَأَمْثَٰلِ ٱللُّؤْلُؤِ ٱلْمَكْنُونِ. ﴿23﴾ |
| 24 ఇదంతా వారు చేస్తూ ఉండిన వాటికి (సత్కార్యాలకు) ప్రతిఫలంగా! | جَزَآءًۢ بِمَا كَانُوا۟ يَعْمَلُونَ. ﴿24﴾ |
|
25
అందులో వారు వ్యర్థమైన మాటలు గానీ, పాప విషయాలు గానీ వినరు.[1]
[1] ప్రాపంచిక జీవితంలో పోట్లాటలు, ఏవగింపులు, అసహ్యాలు స్వంత అన్నదమ్ముల మధ్య కూడా తప్పవు. కాని స్వర్గవాసుల మధ్య ఇటువంటి వ్యర్థపు మాటలు ఎన్నడూ జరుగవు.
|
لَا يَسْمَعُونَ فِيهَا لَغْوًۭا وَلَا تَأْثِيمًا. ﴿25﴾ |
|
26
"శాంతి (సలాం) శాంతి (సలాం)!" అనే మాటలు తప్ప![1]
[1] చూడండి, 19:62.
|
إِلَّا قِيلًۭا سَلَٰمًۭا سَلَٰمًۭا. ﴿26﴾ |
| 27 మరియు కుడి పక్షం వారు, ఆ కుడి పక్షం వారు ఎంత (అదృష్టవంతులు)! | وَأَصْحَٰبُ ٱلْيَمِينِ مَآ أَصْحَٰبُ ٱلْيَمِينِ. ﴿27﴾ |
|
28
వారు ముళ్ళు లేని సిదర్ వృక్షాల మధ్య ![1]
[1] చూడండి, 53:14.
|
فِى سِدْرٍۢ مَّخْضُودٍۢ. ﴿28﴾ |
| 29 మరియు పండ్ల గెలలతో నిండిన అరటి చెట్లు; | وَطَلْحٍۢ مَّنضُودٍۢ. ﴿29﴾ |
|
30
మరియు వ్యాపించి ఉన్న నీడలు,[1]
[1] చూడండి, 4:57.
|
وَظِلٍّۢ مَّمْدُودٍۢ. ﴿30﴾ |
| 31 మరియు ఎల్లప్పుడు ప్రవహించే నీరు; | وَمَآءٍۢ مَّسْكُوبٍۢ. ﴿31﴾ |
| 32 మరియు సమృద్ధిగా ఉన్న పండ్లు, ఫలాలు; | وَفَٰكِهَةٍۢ كَثِيرَةٍۢ. ﴿32﴾ |
| 33 ఎడతెగకుండా మరియు అంతం కాకుండా (ఉండే వనాలలో); | لَّا مَقْطُوعَةٍۢ وَلَا مَمْنُوعَةٍۢ. ﴿33﴾ |
|
34
మరియు ఎత్తైన ఆసనాల మీద (కూర్చొని) ఉంటారు.[1]
[1] కొందరు వ్యాఖ్యాతలు: 'ఫురుషిన్' - శబ్దానికి, భార్యలు అని అర్థమిచ్చారు. మరియు 'మర్ ఫూ'అతిన్' అంటే మంచి, పెద్ద స్థానాలు గలవారు అని.
|
وَفُرُشٍۢ مَّرْفُوعَةٍ. ﴿34﴾ |
| 35 నిశ్చయంగా, మేము వారిని ప్రత్యేక సృష్టిగా సృష్టించాము; | إِنَّآ أَنشَأْنَٰهُنَّ إِنشَآءًۭ. ﴿35﴾ |
|
36
మరియు వారిని (నిర్మలమైన) కన్యలుగా చేశాము;[1]
[1] సద్వర్తనులైన స్త్రీలు చనిపోయినప్పుడు ఎంత వృద్ధులుగా ఉన్నా, పునరుత్థాన దినమున యవ్వన కన్యలుగా లేపబడతారు. వారు నిత్యం యవ్వన స్థితిలోనే ఉంటారు.
|
فَجَعَلْنَٰهُنَّ أَبْكَارًا. ﴿36﴾ |
|
37
వారు ప్రేమించేవారు గానూ, సమ వయస్సుగల వారు గానూ (ఉంటారు);[1]
[1] చూడండి, 38:52 మరియు 78:33.
|
عُرُبًا أَتْرَابًۭا. ﴿37﴾ |
| 38 కుడిపక్షం వారి కొరకు. | لِّأَصْحَٰبِ ٱلْيَمِينِ. ﴿38﴾ |
| 39 అందులో చాలా మంది మొదటి తరాలకు చెందిన వారుంటారు; | ثُلَّةٌۭ مِّنَ ٱلْأَوَّلِينَ. ﴿39﴾ |
| 40 మరియు తరువాత తరాల వారిలో నుండి చాలా మంది ఉంటారు. | وَثُلَّةٌۭ مِّنَ ٱلْءَاخِرِينَ. ﴿40﴾ |
| 41 ఇక వామ(ఎడమ) పక్షం వారు; ఆ వామపక్షం వారు ఎంత (దౌర్భాగ్యులు)? | وَأَصْحَٰبُ ٱلشِّمَالِ مَآ أَصْحَٰبُ ٱلشِّمَالِ. ﴿41﴾ |
| 42 వారు దహించే నరకాగ్నిలో మరియు సలసలకాగే నీటిలో; | فِى سَمُومٍۢ وَحَمِيمٍۢ. ﴿42﴾ |
| 43 మరియు నల్లటి పొగఛాయలో (ఉంటారు). | وَظِلٍّۢ مِّن يَحْمُومٍۢ. ﴿43﴾ |
| 44 అది చల్లగానూ ఉండదు మరియు ఓదార్చేదిగానూ ఉండదు; | لَّا بَارِدٍۢ وَلَا كَرِيمٍ. ﴿44﴾ |
| 45 నిశ్చయంగా, వారు ఇంతకు ముందు చాలా భోగభాగ్యాలలో పడి ఉండిరి; | إِنَّهُمْ كَانُوا۟ قَبْلَ ذَٰلِكَ مُتْرَفِينَ. ﴿45﴾ |
| 46 మరియు వారి మూర్ఖపు పట్టుతో ఘోరమైన పాపాలలో పడి ఉండిరి; | وَكَانُوا۟ يُصِرُّونَ عَلَى ٱلْحِنثِ ٱلْعَظِيمِ. ﴿46﴾ |
| 47 మరియు వారు ఇలా అనేవారు: "ఏమీ? మేము మరణించి, మట్టిగా మరియు ఎముకలుగా మారిపోయిన తరువాత కూడా మరల బ్రతికించి లేపబడతామా? | وَكَانُوا۟ يَقُولُونَ أَئِذَا مِتْنَا وَكُنَّا تُرَابًۭا وَعِظَٰمًا أَءِنَّا لَمَبْعُوثُونَ. ﴿47﴾ |
| 48 మరియు పూర్వీకులైన మా తాతముత్తాతలు కూడానా? | أَوَءَابَآؤُنَا ٱلْأَوَّلُونَ. ﴿48﴾ |
| 49 వారితో ఇలా అను: "నిశ్చయంగా, పూర్వీకులు మరియు తరువాత వారు కూడానూ! | قُلْ إِنَّ ٱلْأَوَّلِينَ وَٱلْءَاخِرِينَ. ﴿49﴾ |
| 50 వారందరూ ఆ నిర్ణీత రోజు, ఆ సమయమున సమావేశ పరచబడతారు. | لَمَجْمُوعُونَ إِلَىٰ مِيقَٰتِ يَوْمٍۢ مَّعْلُومٍۢ. ﴿50﴾ |
| 51 ఇక నిశ్చయంగా, మార్గభ్రష్టులైన ఓ అసత్యవాదులారా! | ثُمَّ إِنَّكُمْ أَيُّهَا ٱلضَّآلُّونَ ٱلْمُكَذِّبُونَ. ﴿51﴾ |
|
52
మీరు జఖ్ఖూమ్ చెట్టు (ఫలాల) ను తింటారు.[1]
[1] చూడండి, 38:52 మరియు 78:33 .
|
لَءَاكِلُونَ مِن شَجَرٍۢ مِّن زَقُّومٍۢ. ﴿52﴾ |
| 53 దానితో కడుపులు నింపుకుంటారు. | فَمَالِـُٔونَ مِنْهَا ٱلْبُطُونَ. ﴿53﴾ |
| 54 తరువాత, దాని మీద సలసల కాగే నీరు త్రాగుతారు. | فَشَٰرِبُونَ عَلَيْهِ مِنَ ٱلْحَمِيمِ. ﴿54﴾ |
| 55 వాస్తవానికి మీరు దానిని దప్పిక గొన్న ఒంటెల వలే త్రాగుతారు. | فَشَٰرِبُونَ شُرْبَ ٱلْهِيمِ. ﴿55﴾ |
| 56 తీర్పుదినం నాడు (ఈ వామపక్షం వారికి లభించే) ఆతిథ్యం ఇదే! | هَٰذَا نُزُلُهُمْ يَوْمَ ٱلدِّينِ. ﴿56﴾ |
| 57 మిమ్మల్ని మేమే సృష్టించాము; అయితే మీరెందుకు ఇది సత్యమని నమ్మరు? | نَحْنُ خَلَقْنَٰكُمْ فَلَوْلَا تُصَدِّقُونَ. ﴿57﴾ |
| 58 ఏమీ? మీరెప్పుడైనా, మీరు విసర్జించే వీర్యబిందువును గమనించారా? | أَفَرَءَيْتُم مَّا تُمْنُونَ. ﴿58﴾ |
| 59 ఏమీ? మీరా, దానిని సృష్టించేవారు? లేక మేమా దాని సృష్టికర్తలము? | ءَأَنتُمْ تَخْلُقُونَهُۥٓ أَمْ نَحْنُ ٱلْخَٰلِقُونَ. ﴿59﴾ |
| 60 మేమే మీ కోసం మరణం నిర్ణయించాము మరియు మమ్మల్ని అధిగమించేది ఏదీ లేదు; | نَحْنُ قَدَّرْنَا بَيْنَكُمُ ٱلْمَوْتَ وَمَا نَحْنُ بِمَسْبُوقِينَ. ﴿60﴾ |
| 61 మీ రూపాలను మార్చి వేసి మీరు ఎరుగని (ఇతర రూపంలో) మిమ్మల్ని సృష్టించటం నుండి. | عَلَىٰٓ أَن نُّبَدِّلَ أَمْثَٰلَكُمْ وَنُنشِئَكُمْ فِى مَا لَا تَعْلَمُونَ. ﴿61﴾ |
| 62 మరియు వాస్తవానికి మీ మొదటి సృష్టిని గురించి మీరు తెలుసుకున్నారు; అయితే మీరెందుకు గుణపాఠం నేర్చుకోరు? | وَلَقَدْ عَلِمْتُمُ ٱلنَّشْأَةَ ٱلْأُولَىٰ فَلَوْلَا تَذَكَّرُونَ. ﴿62﴾ |
| 63 మీరు నాటే, విత్తనాలను గురించి, మీరెప్పుడైనా ఆలోచించారా? | أَفَرَءَيْتُم مَّا تَحْرُثُونَ. ﴿63﴾ |
| 64 మీరా వాటిని పండించేది? లేక మేమా వాటిని పండించే వారము? | ءَأَنتُمْ تَزْرَعُونَهُۥٓ أَمْ نَحْنُ ٱلزَّٰرِعُونَ. ﴿64﴾ |
| 65 మేము తలచుకుంటే, దానిని పొట్టుగా మార్చి వేయగలము. అప్పుడు మీరు ఆశ్చర్యంలో పడి పోతారు." | لَوْ نَشَآءُ لَجَعَلْنَٰهُ حُطَٰمًۭا فَظَلْتُمْ تَفَكَّهُونَ. ﴿65﴾ |
| 66 (మీరు అనేవారు): "నిశ్చయంగా, మేము పాడై పోయాము! | إِنَّا لَمُغْرَمُونَ. ﴿66﴾ |
| 67 కాదు, కాదు, మేము దరిద్రుల మయ్యాము! అని. | بَلْ نَحْنُ مَحْرُومُونَ. ﴿67﴾ |
| 68 ఏమీ? మీరెప్పుడైనా మీరు త్రాగే నీటిని గురించి ఆలోచించారా? | أَفَرَءَيْتُمُ ٱلْمَآءَ ٱلَّذِى تَشْرَبُونَ. ﴿68﴾ |
| 69 మీరా దానిని మేఘాల నుండి కురిపించే వారు? లేక మేమా దానిని కురిపించేవారము? | ءَأَنتُمْ أَنزَلْتُمُوهُ مِنَ ٱلْمُزْنِ أَمْ نَحْنُ ٱلْمُنزِلُونَ. ﴿69﴾ |
| 70 మేము తలచుకుంటే దానిని ఎంతో ఉప్పుగా ఉండేలా చేసేవారము! అయినా మీరెందుకు కృతజ్ఞతలు చూపరు? | لَوْ نَشَآءُ جَعَلْنَٰهُ أُجَاجًۭا فَلَوْلَا تَشْكُرُونَ. ﴿70﴾ |
| 71 మీరు రాజేసే అగ్నిని గమనించారా? | أَفَرَءَيْتُمُ ٱلنَّارَ ٱلَّتِى تُورُونَ. ﴿71﴾ |
|
72
దాని వృక్షాన్ని పుట్టించినవారు మీరా? లేక దానిని ఉత్పత్తి చేసినది మేమా?[1]
[1] అంటే అన్ని రకాల ఇంధనం, బొగ్గు, పెట్రోలు, మొదలైనవి చెట్ల నుంచే వస్తాయని.
|
ءَأَنتُمْ أَنشَأْتُمْ شَجَرَتَهَآ أَمْ نَحْنُ ٱلْمُنشِـُٔونَ. ﴿72﴾ |
|
73
మేము దానిని (నరకాగ్నిని), గుర్తు చేసేదిగా మరియు ప్రయాణీకులకు (అవసరం గలవారికి) ప్రయోజనకారిగా చేశాము.[1]
[1] 'హదీస్'లో మూడు వస్తువుల నుండి ఎవ్వరినీ ఆపకూడదని ఉంది: అవి నీరు, ఆహారం మరియు అగ్ని, (అబూ-దావూద్, సునన్ ఇబ్నె-మాజా - ఇబ్నె-కసీ'ర్ వ్యాఖ్యానం).
|
نَحْنُ جَعَلْنَٰهَا تَذْكِرَةًۭ وَمَتَٰعًۭا لِّلْمُقْوِينَ. ﴿73﴾ |
| 74 కావున సర్వత్తముడైన నీ ప్రభువు నామాన్ని స్తుతించు. | فَسَبِّحْ بِٱسْمِ رَبِّكَ ٱلْعَظِيمِ. ﴿74﴾ |
| 75 ఇక నేను నక్షత్రాల స్థానాల (కక్ష్యల) సాక్షిగా చెబుతున్నాను. | ۞ فَلَآ أُقْسِمُ بِمَوَٰقِعِ ٱلنُّجُومِ. ﴿75﴾ |
| 76 మరియు నిశ్చయంగా, మీరు గమనించగలిగితే, ఈ శపథం ఎంతో గొప్పది! | وَإِنَّهُۥ لَقَسَمٌۭ لَّوْ تَعْلَمُونَ عَظِيمٌ. ﴿76﴾ |
| 77 నిశ్చయంగా, ఈ ఖుర్ఆన్ దివ్యమైనది. | إِنَّهُۥ لَقُرْءَانٌۭ كَرِيمٌۭ. ﴿77﴾ |
|
78
సురక్షితమైన[1] గ్రంథంలో ఉన్నది.
[1] అంటే లౌ'హె మ'హ్ ఫూ''జ్ లో
|
فِى كِتَٰبٍۢ مَّكْنُونٍۢ. ﴿78﴾ |
|
79
దానిని[1] పరిశుద్ధులు తప్ప మరెవ్వరూ తాకలేరు.
[1] దానిని అంటే లౌ'హె మ'హ్ ఫూ''జ్ మరియు పరిశుద్ధులు అంటే దైవదూత, అని కొందరి అభిప్రాయం. మరికొందరు దానిని - అంటే - ఖుర్ఆన్, అని అంటారు. దానిని ఆకాశం నుండి అవతరింపజేస్తున్న వారు కేవలం దైవదూతలే! సత్యతిరస్కారులు అపోహలు లేపినట్లు, షైతానులు కాదు. ఎందుకంటే వారు దానిని తాకలేరు. చూడండి, 85:21-22.
|
لَّا يَمَسُّهُۥٓ إِلَّا ٱلْمُطَهَّرُونَ. ﴿79﴾ |
| 80 ఇది సర్వలోకాల ప్రభువు తరఫు నుండి అవతరింప జేయబడింది. | تَنزِيلٌۭ مِّن رَّبِّ ٱلْعَٰلَمِينَ. ﴿80﴾ |
|
81
ఏమీ? మీరు ఈ సందేశాన్ని[1] తేలికగా తీసుకుంటున్నారా?
[1] సందేశమంటే ఇక్కడ ఖుర్ఆన్ అని హదీస్ లో పేర్కొనబడింది.
|
أَفَبِهَٰذَا ٱلْحَدِيثِ أَنتُم مُّدْهِنُونَ. ﴿81﴾ |
|
82
మరియు (అల్లాహ్) మీకు ప్రసాదిస్తున్న జీవనోపాధికి (కృతజ్ఞతలు) చూపక, వాస్తవానికి ఆయనను మీరు తిరస్కరిస్తున్నారా?[1]
[1] పైది ఇబ్నె-కసీ'ర్ తాత్పర్యం. ము'హమ్మద్ జునాగఢి గారి తాత్పర్యం ఈ విధంగా ఉంది: 'మరియు మీరు తిరస్కరిస్తూఉండటమే మీ జీవనోపాధిగా చేసుకుంటున్నారా?'
|
وَتَجْعَلُونَ رِزْقَكُمْ أَنَّكُمْ تُكَذِّبُونَ. ﴿82﴾ |
| 83 అయితే (చనిపోయేవాడి) ప్రాణం గొంతులోనికి వచ్చినపుడు, మీరెందుకు (ఆపలేరు)? | فَلَوْلَآ إِذَا بَلَغَتِ ٱلْحُلْقُومَ. ﴿83﴾ |
| 84 మరియు అప్పుడు మీరు (ఏమీ చేయలేక) చూస్తూ ఉండిపోతారు. | وَأَنتُمْ حِينَئِذٍۢ تَنظُرُونَ. ﴿84﴾ |
|
85
మరియు అప్పుడు మేము అతనికి మీకంటే చాలా దగ్గరలో ఉంటాము, కాని మీరు చూడలేక పోతారు.[1]
[1] ఇక్కడ కొందరు అల్లాహ్ (సు.తా.) తన జ్ఞానంతో మీ దగ్గరలో ఉన్నాడనీ, మరికొందరు ఇక్కడ దాని భావం ప్రాణం తీసే దైవదూతలనీ వ్యాఖ్యానించారు.
|
وَنَحْنُ أَقْرَبُ إِلَيْهِ مِنكُمْ وَلَٰكِن لَّا تُبْصِرُونَ. ﴿85﴾ |
| 86 ఒకవేళ మీరు ఎవరి అదుపాజ్ఞలో (ఆధీనంలో) లేరనుకుంటే; | فَلَوْلَآ إِن كُنتُمْ غَيْرَ مَدِينِينَ. ﴿86﴾ |
| 87 మీరు సత్యవంతులే అయితే దానిని (ఆ ప్రాణాన్ని) ఎందుకు తిరిగి రప్పించుకోలేరు? | تَرْجِعُونَهَآ إِن كُنتُمْ صَٰدِقِينَ. ﴿87﴾ |
|
88
కాని అతడు (మరణించేవాడు), (అల్లాహ్) సాన్నిధ్యాన్ని పొందినవాడైతే![1]
[1] సూరహ్ మొదట్లో పేర్కొన్న మూడు రకాల వారిలో వీరు మొదటి రకానికి చెందినవారు.
|
فَأَمَّآ إِن كَانَ مِنَ ٱلْمُقَرَّبِينَ. ﴿88﴾ |
| 89 అతని కొరకు సుఖసంతోషాలు మరియు తృప్తి మరియు పరమానందకరమైన స్వర్గవనం ఉంటాయి. | فَرَوْحٌۭ وَرَيْحَانٌۭ وَجَنَّتُ نَعِيمٍۢ. ﴿89﴾ |
|
90
మరియు ఎవడైతే కుడిపక్షం వారికి చెందినవాడో![1]
[1] వీరు రెండవ రకానికి చెందినవారు.
|
وَأَمَّآ إِن كَانَ مِنْ أَصْحَٰبِ ٱلْيَمِينِ. ﴿90﴾ |
| 91 అతనితో: "నీకు శాంతి కలుగుగాక (సలాం)! నీవు కుడిపక్షం వారిలో చేరావు." (అని అనబడుతుంది). | فَسَلَٰمٌۭ لَّكَ مِنْ أَصْحَٰبِ ٱلْيَمِينِ. ﴿91﴾ |
|
92
మరియు ఎవడైతే, అసత్యవాదులు, మార్గభ్రష్టులైన వారిలో చేరుతాడో![1]
[1] వీరు మూడవ రకానికి చెందినవారు వీరు అస్'హాబ్ మష్అమ అని, ఈ సూరహ్ మొదట్లో పేర్కొనబడ్డారు.
|
وَأَمَّآ إِن كَانَ مِنَ ٱلْمُكَذِّبِينَ ٱلضَّآلِّينَ. ﴿92﴾ |
| 93 అతని ఆతిథ్యానికి సలసల కాగే నీరు ఉంటుంది. | فَنُزُلٌۭ مِّنْ حَمِيمٍۢ. ﴿93﴾ |
| 94 మరియు భగభగమండే నరకాగ్ని ఉంటుంది. | وَتَصْلِيَةُ جَحِيمٍ. ﴿94﴾ |
| 95 నిశ్చయంగా, ఇది రూఢి అయిన నమ్మదగిన సత్యం! | إِنَّ هَٰذَا لَهُوَ حَقُّ ٱلْيَقِينِ. ﴿95﴾ |
|
96
కావున సర్వత్తముడైన నీ ప్రభువు పేరును స్తుతించు.[1]
[1] 'హదీస్' లో వచ్చింది: : రెండు పదాలు అల్లాహ్ (సు.తా.) కు ఎంతో ప్రియమైనవి. ఉచ్చరించటానికి సులభమైనవి మరియు ప్రతిఫలం రీత్యా బరువైనవి. "సుబ్ హానల్లాహి వ బి'హమ్ ది హీ, సుబ్ హానల్లాహిల్ 'అ'"జీమ్!" ('స'హీ'హ్ బు'ఖారీ, 'స'హీ'హ్ ముస్లిం).
|
فَسَبِّحْ بِٱسْمِ رَبِّكَ ٱلْعَظِيمِ. ﴿96﴾ |